Will AP lose again with Kiran Kumar Reddy?సమైఖ్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి మళ్ళీ రాజకీయ ప్రవేశం చేయనున్నారా? అంటే అవుననే చెపుతున్నారు ఆయన. ఇటీవల ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీతో సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించడంతో ఆయనకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ నెలరోజులైనా ఆయన కానీ, పార్టీ గానీ ఈ వార్తను దృవీకరించలేదు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి హడావుడి కనిపించడంలేదు కూడా.

ఈరోజు ఉదయం కిరణ్ కుమార్‌ రెడ్డి తన కుమారుడు నిఖిలేశ్ రెడ్డిని వెంటబెట్టుకొని హైదరాబాద్‌ నుంచి బెంగళూరు మీదుగా అన్నమయ్య జిల్లాలోని కలికిరి గ్రామానికి వచ్చారు. అక్కడ వారికి రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శి కెఎస్. అఘామోహిద్దీన్, జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి డాక్టర్ శ్రీవర్ధన్ పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు సాధారంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్‌ రెడ్డి తాను త్వరలోనే వచ్చి మళ్ళీ అందరినీ కలుస్తానని చెప్పారు. రాజకీయాల గురించి అప్పుడు మాట్లాడుకొందామని చెప్పారు.

ఒకవేళ కిరణ్ కుమార్‌ రెడ్డి ఏపీ రాజకీయాలలోకి ప్రవేశిస్తే, ఆయన వల్ల ముందుగా నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీయే. తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరోసారి నష్టపోతుంది.

రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో ఆ పార్టీ నుంచి పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకొనేందుకు ప్రత్యామ్నాయంగా కనిపించిన వైసీపీలో చేరిపోయారు. కిరణ్ కుమార్‌ రెడ్డి వారినందరినీ వెనక్కు రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు.

ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నించవచ్చు. అలాగే రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గ ప్రజలతో సహా ఎన్నటికీ నమ్మకంగా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉండే ఓటు బ్యాంకును కూడా ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు.

ఒకవేళ కిరణ్ కుమార్‌ రెడ్డి ఏపీ రాజకీయాలలో ప్రవేశిస్తే రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు మారవచ్చు. దాంతో వచ్చే ఎన్నికలలో అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే ఆయన పుణ్యమాని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఓ రాజకీయ ప్రయోగశాలగా మారిపోయింది. కనుక ఆయనవస్తే మళ్ళీ ఆయన వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరోసారి నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. కనుక ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది.