రమణ మీద నిరాధార ఆరోపణలు చేసిన జగన్ పై యాక్షన్ తీసుకోనున్నారా?సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చంద్రబాబు హయాంలో అక్రమంగా అమరావతిలో భూములు పొందారు… దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ హై కోర్టు వ్యవహారాలలో జోక్యం చేసుకుని తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని జగన్ ఆరోపించారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చెయ్యడమే కాకుండా దానిని మీడియాకు కూడా విడుదల చేశారు. అయితే జగన్ చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఆ ప్రకటన ప్రకారం, అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదని చెప్పింది.

దీనితో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి రమణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి పై తీవ్రమైన ఆరోపణలు చెయ్యడమే కాకుండా దానిని మీడియా ముందు బహిరంగపరచడం తీవ్రమైన విషయం అవుతుంది. ఇది ఏమైనా జగన్ కు ఇబ్బంది కలుగుతుందా అనేది చూడాలి.