Why Mega Brothers became target in this Remake Panchayatముందో చిన్న కథ చెప్పుకుందాం. ఏ నగర్ కాలనీలో ఉండే చక్కనమ్మ ఓ కొత్త చీర కట్టుకుంది. చూసినోళ్లందరూ అద్భుతంగా ఉందని తెగ మెచ్చేసుకున్నారు. పక్కవీధిలో ఉండే మువ్వలమ్మకు ఈ విషయం తెలిసి అచ్చం అలాంటిదే అదే రంగుది కొనుక్కుంది. ఊహించినట్టే అందరూ తెగ పొగిడేశారు. ఒకరికొకరు తెలియదు కాబట్టి ఇలా నడిచిపోయింది. ఒకవేళ వీళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లలోనే ఉంటే మువ్వలమ్మను కాపీ కొట్టి తెచ్చుకున్నావని దెప్పిపొడిచేవాళ్ళు. ఇప్పుడీ బుల్లి స్టోరీ టాలీవుడ్ లో జరుగుతున్న రీమేకుల పంచాయితీకి అచ్చంగా సరిపోతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వీటి వెంటపడటంతో ఏకంగా మొహం మొత్తే దాకా వెళ్తోంది.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి తొంగిచూసి వర్తమానంలోకి వద్దాం. 1988లో తమిళంలో వచ్చిన భాగ్యరాజా సూపర్ హిట్ సినిమాని చిన్నరాజాగా డబ్బింగ్ చేస్తే తెలుగులోనూ బాగానే ఆడింది. ఓ నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చి వెంకటేష్ దీన్నే ఈవీవీ డైరెక్షన్లో అబ్బాయిగారుగా తీస్తే ఇక్కడా ఘన విజయం సాధించింది. కృష్ణంరాజు ప్రాణ స్నేహితులు రజనీకాంత్ అన్నామలైగా వస్తే తిరిగి దాన్ని కొండపల్లి రాజాగా వెంకీ మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు. బాలకృష్ణకు మాస్ లో ఫాలోయింగ్ తెచ్చిన మంగమ్మ గారి మనవడు, నాగార్జునకు బ్రేక్ ఇచ్చిన వారసుడు అన్నీ వేరే బాషల నుంచి తీసుకొచ్చిన కథలే. సరే అప్పుడంటే టెక్నాలజీ లేదు కాబట్టి ఇవన్నీ చెల్లిపోయాయి.

కాలం మారింది. ఎంటర్ టైన్మెంట్ కు రకరకాల ఆప్షన్లు వచ్చాయి. కోలీవుడ్ లో మల్లువుడ్ లోనో ఏదైనా మూవీ హిట్ అయ్యిందని తెలిస్తే చాలు ఓటిటిలో వెతికి మరీ చూసేస్తున్నారు. ఇప్పుడు పవన్ తేరి రీమేక్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అభిమానులు ఏకంగా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించే దాకా వెళ్ళింది. నిజంగా అలా చేయకపోయినా వాళ్ళ ఆవేదనలో అర్థముంది. డబ్బింగ్ వెర్షన్ ఆన్ లైన్ లో దొరుకుతున్న పోలీసోడు మళ్ళీ తీయడమేంటనేది వాళ్ళ వాదన. గాడ్ ఫాదర్ టైంలోనూ లూసిఫర్ తో పోలికలు తెచ్చి రచ్చ చేసిన బ్యాచ్ ట్విట్టర్ లో పెద్దదే ఉంది. అసలు ఎందుకు రీమేక్స్ విషయంలో మెగా బ్రదర్సే టార్గెట్ అవుతున్నారనేది చూడాలి

చిరంజీవి పవన్ కళ్యాణ్ ల ఇమేజ్ దృష్ట్యా వాళ్ళ ఏ కదలిక అయినా సరే కోట్లాది ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఎవరూ చేయనిది తమ హీరోలు చేయాలని తాపత్రయపడతారు. అలాంటిది పదే పదే రీమేకుల జోలికి వెళ్ళినప్పుడు అసహనం కలగడం సహజం. చిరు కంబ్యాక్ అయ్యాక ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ మూడూ అవే బాపతే. పవన్ కళ్యాణ్ తక్కువ గ్యాప్ లో వరసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇప్పుడు తేరి ఇలా అతనూ వాటికే ఓటేస్తున్నాడు. ఓటిటి జమానాలో కొరియన్ వే చూడగలుతున్న ఆడియన్స్ ఆఫ్ట్రాల్ తమిళ మళయాలం చూడలేరా. ఈ లాజిక్ మర్చిపోలేక మెగా అన్నదమ్ములు తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్యాన్స్ కి అసహనాన్ని కలిగిస్తున్నాయి.