YS Jaganఈ నెల 16 నుంచి 20వరకు స్విట్జర్‌ల్యాండ్ దేశంలో దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి తన అధికారుల బృందంతో కలిసి అక్కడికి చేరుకొని తొలి రోజు సదస్సులోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్) అనే ఓ శాస్త్రీయ అధ్యయన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకొన్నారు. ప్రపంచంలో అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాలలో మాత్రమే ఈ అధ్యయన కేంద్రాలున్నాయి. ఇప్పుడు భారత్‌లో హైదరాబాద్‌ నగరానికి దానిని సాధించుకొన్నారు. లైఫ్ సైన్సస్, హెల్త్ సైన్సస్ రంగాలలో శాస్త్రీయ అధ్యయనాలకి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

గత ఏడాది గన్నవరం నుంచి ప్రత్యేక విమానం కట్టించుకొని సిఎం జగన్మోహన్ రెడ్డి లండన్ మీదుగా దావోస్ వెళ్ళారు. ఆయన పర్యటన విజయవంతమైందని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించారని చెప్పుకొన్నారు. అవ్వెక్కడ పెట్టారో తెలీదు కానీ ఈసారి సిఎం జగన్‌ దావోస్ పర్యటనకి వెళ్లలేదు. సంక్రాంతికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గోపూజ కార్యక్రమం ఉండటం వలన బహుశః వెళ్ళలేకపోయి ఉండొచ్చు. ఒకవేళ వెళ్ళి ఉంటే గత ఏడాదిలాగే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించుకొని వచ్చి ఉండేవారేమో?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దావోస్ వెళ్ళలేక తన కుమారుడు, రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ని ఏటా దావోస్ పంపిస్తుంటారు. ఆయన ప్రతీ ఏటా దావోస్ వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి కనీసం రూ.20-30,000 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ సంస్థలు సాధించుకు వస్తుంటారు.

మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా ఐ‌టిశాఖ మంత్రిగా గుడివాడ అమర్నాధ్ ఉన్నారు. ఈసారి సిఎం జగన్మోహన్ రెడ్డి అనివార్య కారాణాల వలన దావోస్ వెళ్ళలేకపోయారు కనుక గుడివాడ అమర్నాథ్ వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చు. కానీ అయన కూడా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని విమర్శించడంతో, మూడు రాజధానులపై ప్రతిపక్షాల వాదనలు తిప్పి కొట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. కనుక ఆయన కూడా దావోస్ పర్యటనకి వెళ్ళలేకపోయారు. కనుక ఆయన దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లే అని చెప్పక తప్పదు.