Chandrababu Naidu BJPబిజెపి ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్ శనివారం విశాఖలో మాట్లాడుతూ, “ఏపీలో మాకు జనసేనతో తప్ప మరో పార్టీతో పొత్తులు అవసరమే లేదు. త్వరలోనే మా రెండు పార్టీలు కలిసి జగన్‌ ప్రభుత్వంపై ఐక్యపోరాటాలు ప్రారంభిస్తాయి,” అని అన్నారు.

అప్పుడప్పుడు ఏపీకి చుట్టం చూపుగా వచ్చి ఏవో నాలుగు ముక్కలు మాట్లాడే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు చంద్రబాబు నాయుడు ఓడిపోగానే హైదరాబాద్‌ వెళ్ళిపోయారు. ఈసారి సిఎం జగన్‌ వెళ్ళిపోయి లోటస్ పాండ్‌లో కూర్చోంటారు,” అంటూ టిడిపి, వైసీపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఏపీలో టిడిపి చాలా బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా బిజెపితో పొత్తులకు ప్రయత్నిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బిజెపిని తమవైపు తిప్పుకోకపోతే వచ్చే ఎన్నికలలో అది వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చినా మరోసారి ఎదురుదెబ్బ తింటామని చంద్రబాబు నాయుడు భావిస్తుండటమే ఇందుకు కారణమై ఉండవచ్చు.

కారణాలు ఏవైనప్పటికీ ఆయన బిజెపి కోసం ప్రాకులాడుతున్నారని ఇక్కడ వైసీపీ, అక్కడ బిఆర్ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలతో ఆయన ప్రతిష్ట, టిడిపి ప్రతిష్ట కూడా దెబ్బతింటున్నాయని చెప్పక తప్పదు. ప్రధాని నరేంద్రమోడీ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయడంతో ఏపీలో కనీస ప్రజాధారణలేని బిజెపి నేతలు కూడా టిడిపిని , చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఇదీ టిడిపి ప్రతిష్టకి భంగం కలిగిస్తోందనే చెప్పవచ్చు. అయినా చంద్రబాబు నాయుడు కానీ టిడిపి సీనియర్ నేతలు గానీ ఈ విమర్శలను అసలు పట్టించుకోవడం లేదు. కనీసం స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే టిడిపి ఇంకా బిజెపితో పొత్తుల కోసం ఎదురుచూస్తోందనుకోవాలా లేక టిడిపితో తమకి ఎటువంటి సంబందమూ లేదని తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకే బిజెపి వ్యూహాత్మకంగా విమర్శలు చేస్తోందని చంద్రబాబు నాయుడు గుర్తించి మౌనంగా వాటిని భరిస్తున్నారనుకోవాలా?అంటే రెండూ వాస్తవమే అనిపిస్తుంది.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు టిడిపి యధాశక్తిన సాయపడితే, అందుకు బదులుగా ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సాయపడాలని చంద్రబాబు నాయుడు ఆశించడం సహజమే. అయితే ఏపీలో టిడిపితో బిజెపికి దోస్తీకి ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే, దానిని తెలంగాణ సిఎం కేసీఆర్‌ తనకి అనుకూలంగా మలుచుకొని, తెలంగాణ సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందాలని ప్రయత్నించడం ఖాయం. బహుశః అందుకే ఏపీలో బిజెపి తమకి దూరంగా ఉంటోందని చంద్రబాబు నాయుడు కూడా గ్రహించినందువల్లే, రాష్ట్రంలో బిజెపి నేతలు తన గురించి ఎన్ని అవాకులు చవాకులా వాగుతున్నా పట్టించుకోవడం లేదేమో? కానీ వారి మాటలతో తన, టిడిపి ప్రతిష్టకి కలుగుతున్న నష్టం సంగతి ఏమిటి?