why Big Producers are after dubbing Moviesఏమైనా డబ్బింగ్ సినిమాలతో ఉండే సుఖమే వేరు. ప్రొడక్షన్ తలనెప్పులు, క్యాస్టింగ్ గొడవలు, కాల్ షీట్ల ఇబ్బందులు వగైరా ఏమీ లేకుండా కేవలం అనువాదం చేయించి చక్కగా మార్కెటింగ్ చేసుకుంటే చాలు లాభాలే లాభాలు. ఒకప్పుడు ఏఎం రత్నం వీటి వల్లే అగ్ర నిర్మాతగా ఎదిగి అతి తక్కువ టైంలోనే కమల్ హాసన్ తో భారతీయుడు తీసే రేంజ్ కి చేరుకున్నారు. అప్పుడు పడిన పునాదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు దాకా తీసుకొచ్చింది. మధ్యలో స్ట్రెయిట్ మూవీస్ చాలానే తీశారు కానీ అందులో అధిక శాతం రీమేకులే. మన టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సైతం అయితే హక్కులు కొనడం లేదా డిస్ట్రిబ్యూట్ చేయడమనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.

గత ఆగస్ట్ 30న రిలీజైన పొన్నియన్ సెల్వన్ 1ని దిల్ రాజు, అదే రోజు ధనుష్ నేనే వస్తున్నాతో అల్లు అరవింద్ బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యారు. పిఎస్ 1 సైతం ఇక్కడ భారీ విజయం సాధించకపోయినా పైచేయి సాధించింది. పదిహేను రోజుల గ్యాప్ తో అరవింద్ కాంతారని సెప్టెంబర్ 15న ఏపి తెలంగాణలో పంపిణి చేశారు. కట్ చేస్తే అది మాములు బ్లాక్ బస్టర్ కాలేదు. రెండు కోట్ల బిజినెస్ కి పాతిక కోట్ల షేర్ రాబట్టి వామ్మో అనిపించేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇదే తరహా యుద్ధం ఈ ఇద్దరి మధ్య జరగనుంది. వచ్చే వారం 25న బాలీవుడ్ మూవీ తోడేలుని అల్లు అరవింద్ తీసుకొస్తున్నారు. ప్రమోషన్లు కూడా బాగానే జరుగుతున్నాయి. వరుణ్ ధావన్ హీరో.

ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయకపోయినా దిల్ రాజు కొనేసుకున్న రీసెంట్ తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే కూడా అదే రోజు రిలీజవ్వనుంది. ట్రైలర్ లో థిస్ నవంబరని చెప్పేశారు కాబట్టి ఇంతకన్నా ఆప్షన్ లేదు. ఆలస్యం చేసినా ముప్పే. జనంలో ఆసక్తి తగ్గిపోయి తమిళ వెర్షన్ HD వచ్చేస్తే ఓటిటిలో చూసేస్తారు. సో అరవింద్ రాజు గార్లు ఇద్దరూ మరోసారి తలపడనున్నారు. కాకపోతే ఎంత అనుభవమున్నా ఫలానా సినిమా ఎంత వసూలు చేస్తుందో ముందే అంచనా వేయలేని పరిస్థితిలో వీళ్ళున్న మాట వాస్తవం. ఒకవేళ అంత క్యాలికులేషనే ఉంటే కాంతారని అరవింద్ పర్సెంటేజ్ అవుట్ రైట్ కి కొనేసి కోట్ల లాభాలు కళ్లజూసేవారు

ఇదేమి తప్పు కాదు నేరమూ కాదు కానీ ఇక్కడ బిజినెస్ యాంగిల్ చూస్తే ఇద్దరి ఉద్దేశం ఏమిటో అర్థమవుతుంది. నిజానికి లవ్ టుడే తెలుగులో రీమేక్ అవ్వొచ్చని ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లు భావించారు. కానీ గతంలో 96 రీమేక్ జాను తాలూకు గాయం ఇంకా పచ్చిగానే ఉండటంతో దిల్ రాజు ఈసారి రిస్క్ చేయలేదు. ఇక భేడియా(తోడేలు)లో యునీక్ కాన్సెప్ట్ టాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చుతుందనే నమ్మకం అరవింద్ ది. ఈ క్లాషులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఓ వారం ఆగి చూస్తే క్లారిటీ వస్తుంది. ఒకప్పటిలా టాలీవుడ్ లో డబ్బింగులు తాకిడి తగ్గిపోయింది కానీ కెజిఎఫ్ నుంచి మళ్ళీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నమే ఇదంతా.