Dubbaka By-Election: What Does A Possible Record Turnout Indicate?దుబ్బాక ఉపఎన్నికలో అధికార పక్షానికి చెమటలు పట్టించామని బీజేపీ సంతోషంగా ఉంది. గెలుపు పట్ల ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. ఫలితం ఏమిటనేది 10వ తారీఖున తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా… ఇప్పటి నుండే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు కమలనాథులు. ఈ ప్రక్రియలో భాగంగా తెరాస అసంతృప్త నేతలను టార్గెట్ చేస్తుంది.

టీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని కథనాలు వినపడుతున్నాయి. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. కొద్దిరోజులకే గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.

ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. ఆమె తెరాసలో చేరి మంత్రి కావడంతో తీగలకు మింగుడుపడటం లేదు. సబిత చేరిక సమయంలో ఆయనను ఎమ్మెల్సీ చేస్తామని వాగ్దానం చేసినా నిలబెట్టుకోలేకపోయింది తెరాస అధిష్టానం. గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ వస్తున్న ఆయనతో బీజేపీ మంతనాలు జరుపుతుంది.

అయితే ఆయనను నిలువరించేందుకు తెరాస మంత్రి మల్లారెడ్డిని పంపిందని సమాచారం. దుబ్బాక ఎన్నికలలో గనుక బీజేపీ గెలిస్తే… తీగల బీజేపీలోకి వెళ్లడం ఖాయం అని అంటున్నారు. అలాగే తెరాసలోని ఇతర అసంతృప్త నేతలు కూడా ఆ దిశగా అడుగులు వెయ్యొచ్చు. ఏది ఏమైనా దుబ్బాక ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మార్చే అవకాశం ఉంది.