Pan India Moviesహీరోలు ఎంత వేగంగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి అంత మంచిది. ముఖ్యంగా స్టార్లు ఈ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటే థియేటర్లు ఏడాదిలో కనీసం ఆరు నెలలకు పైగా నిండుగా కళకళలాడుతాయి. కేవలం చిన్న చిత్రాలతో ఎక్కువ కాలం ఫీడింగ్ వచ్చే కాలం కాదిది. ఓటిటి ట్రెండ్ లో ఉత్తినే టైంపాస్ కో ఏసి కోసమో టికెట్లు కొనే జనాలు ఒకప్పటిలా లేరు. కానీ వాస్తవంగా జరుగుతోంది వేరు. మహేష్ త్రివిక్రమ్ కాంబోకు జరిగిన ఆలస్యానికి న్యాయమైన కారణాలు ఉన్నప్పటికీ ఆ జాప్యం వెనుక మరో కోణం తెలియంది కాదు. దీనివల్లే ఏడాదిన్నరకు పైగా తమ అభిమాన హీరోని తెరమీద చూసేందుకు ఫ్యాన్స్ కి ఛాన్స్ ఉండటం లేదు.

ఇక పుష్ప 2ది మరో కథ. అసలు స్క్రిప్ట్ కోసమే సంవత్సరం ఖర్చు పెట్టి ఇటీవలే స్టార్ట్ చేశారు. సుకుమార్ ఎంత వేగంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే 2023లో వచ్చే అవకాశం లేదని ఆల్రెడీ అభిమానులు డిసైడ్ అయ్యారు. రామ్ చరణ్ శంకర్ లది మొదట్లో వేగంగా జరిగితే ఇప్పుడు ఆగి ఆగి సాగుతోంది. దర్శకుడు శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 ని ఒకేసారి చేయాల్సి రావడం వల్ల వచ్చిన తిప్పలివి. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివలది అందరికంటే పెద్ద వ్యథ. తపస్సు చేస్తే దేవుడైనా ప్రత్యక్షమవుతాడేమో కానీ ఈ కలయిక సెట్స్ పైకి వెళ్లేందుకు జరుగుతున్న ఎదురు చూపులకు అంతు లేకుండా పోతోంది.

అంటే అన్నామంటారు కానీ వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే తమిళ హీరో విజయ్ ప్లానింగ్ విషయంలో పక్కాగా ఉండటం వల్లే అనుకున్న టైంకి రిలీజులు ఉండేలా చూసుకుంటున్నాడు. తాజాగా ప్రకటించిన లోకేష్ కనగరాజ్ కి దీపావళి రిలీజ్ ని డిసైడ్ చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లో డెడ్ లైన్ మిస్ కారు. దీనికి ముందు మొన్న వచ్చిన వరిసు, బీస్ట్ లకూ ఇదే సూత్రాన్ని అనుసరించి ఒకపక్క మార్కెట్ ని పెంచుకుంటూనే ఫ్యాన్స్ కోరుకున్న విధంగా వేగంగా సినిమాలు చేయగలుగుతున్నాడు. కానీ మన దగ్గరే పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అలా అని విజయ్ ని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పడం లేదు.

ప్యాన్ ఇండియా మోజులో పడి విలువైన కాలాన్ని ఎంతగా పోగొట్టుకుంటున్నామో అర్థం చేసుకోవాలి. చిరంజీవి బాలకృష్ణ లాగా వంద సినిమాలు చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. అది సాధ్యం కాదు. అలా అని కెరీర్ మొత్తం లో కనీసం ఓ యాభై కౌంట్ అయినా లేకపోతే టాలీవుడ్ చరిత్రలో మన పేజీలకు ప్రత్యేకత ఎలా వస్తుంది. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమనే సామెతలు పనిచేయవు. ఎందుకంటే ఇంత అతి జాగ్రత్త పడినా ఫ్లాపులు రావన్న గ్యారెంటీ లేదు. అలాంటపుడు రిస్కో పస్కో ఏదో ఒకటి చేసెయ్యాలి. ఒక్క నాని లాంటి నిలకడగా గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు కానీ టైర్ 1 బ్యాచ్ మాత్రం నీది నాది ఒకే కథని పాడుకోవాల్సిందే.