Prashant Kishor's Team on Working with TDPరాబోయే ఎన్నికల్లో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ఎలా అనే అంశంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు… ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు నిన్న వార్తలు దావాలనంలా వ్యాపించాయి. అయితే సాయంత్రానికి అటువంటిది ఏమీ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఉన్నఫళంగా ఈ వార్తలు ఎక్కడ నుండి వచ్చాయి అంతా ఆశ్చర్యపోయారు.

“టీడీపీ అధికారంలోకి రావడానికి ఆగలేకుండా ఉందని, అధికారంలోకి పరితపిస్తూ ఒకప్పుడు నిందించిన ప్రశాంత్ కిషోర్ వద్దకే వెళ్ళిందని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజలకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ దుష్ప్రచారానికి దిగింది,” అని కొందరు టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు. కొందరైతే “జగన్ ప్రశాంత్ కిషోర్ కాంట్రాక్టు పొడిగించడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో జగన్ నుండి మంచి డీల్ రాబట్టడానికి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన లీకులు ఇవి,” అని అనుమానపడుతున్నారు.

ఏపీలో పీకే టీమ్ సేవలందించిన వైసీపీ అఖండ విజయం సాధించడంతో… పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ సైతం ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో కలిసి పనిచెయ్యడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. రెండు రోజులలో ఆయన ప్రశాంత్ కిషోర్ టీం లోని కీలక వ్యక్తులతో సమావేశం అవుతారని తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలలో 2021లో ఎన్నికలు జరుగుతాయి.