Pawan kalyanఇండస్ట్రీలో ఎవరి సినిమాలు వాళ్ళిష్టం కానీ హీరోలు ఒకేసారి రాజకీయాలతోనూ ముడిపడినప్పుడు వాటి మీద దృష్టి కేవలం అభిమానులకే కాదు జనాలకు, పార్టీలకు కూడా ఉంటాయి. నిన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వద్దని ముందు నుంచి వేడుకున్న వినోదయ సితం రీమేక్ ని మొదలుపెట్టేశారు. వాళ్ళ ఆవేదన కథ బాగుండదని కాదు. రీ ఎంట్రీ తర్వాత చేసినవి రెండూ రీమేకే కాబట్టి మళ్ళీ ఇదొకటి ఎందుకని. పైగా తమిళంలో బడా స్టారో లేదా టాప్ డైరెక్టరో చేసిందైతే వేరే విషయం. సముతిరఖని ఎంత టాలెంటెడ్ అయినా శంకర్ అంత రేంజ్ అయితే కాదుగా.

దీనికన్నా ముందు తేరి రీమేక్ ని భారీ మార్పులతో ఉస్తాద్ భగత్ సింగ్ గా హరీష్ శంకర్ సిద్ధం చేసి పెట్టాడు. త్వరలోనే దాని రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. బాహుబలి రేంజ్ లో ఉంటుందని ఊహించుకున్న హరిహరవీరమల్లు అంతకంతా వాయిదాలు పెంచుకుంటూ పోతోందే తప్ప ఖచ్చితంగా ఫలానా డేట్ ని రిలీజ్ అవుతుందని నిర్మాత ఏఎం రత్నం సైతం చెప్పలేకపోతున్నారు. ఇక సుజిత్ తో చేస్తున్న ఓజి సంగతులు వాళ్ళుగా చెప్పినప్పుడు తెలుసుకోవాల్సిందే తప్పించి ఇప్పుడప్పుడే దానికి సంబంధించిన అప్డేట్స్ ఆశించకపోవడం మంచిది.

సరే ఇప్పుడిదంతా ఎందుకంటే పవన్ ఇన్నేసి రీమేకులు చేస్తున్నాడని ఫ్యాన్స్ ఒకవైపు తెగ ఇదైపోతున్నారు. జనసేన వైపు పూర్తి ఫోకస్ పెట్టడం లేదని కార్యకర్తలు ఫీలవుతున్నారు. మధ్యలో పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు, డొనేషన్లు, మీటింగులు, యాత్రలు వగైరా బోలెడు తతంగాలు రోజూ ఉంటున్నాయి. ఇంత ఒత్తిడి మధ్య రీమేక్ చేయాలా స్ట్రెయిట్ మూవీ చేయాలా అనేది పవన్ విచక్షణకు సంబందించినది. కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినట్టు కేవలం త్రివిక్రమ్ ప్రభావం వల్లే ఇలా చేస్తున్నాడనుకోవడం అమాయకత్వం.

ఎన్నికల కోసం చేతిలో ఉన్న ఏడాది సమయంలోనే ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ప్రచారం మీద దృష్టి పెట్టాలి. పొత్తుల వ్యవహారం తేలకముందే కొన్ని ప్రింట్ మీడియా వర్గాల్లో వస్తున్న వెయ్యి కోట్ల కథనాలు కలకలం రేపుతున్నాయి. వీటి వెనుక ఉద్దేశాలు ఏవైనా సరే పవన్ నోరు విప్పకముందే తప్పు ఒప్పుల గురించి ట్విట్టర్ లో తీర్పులిచ్చేస్తున్నారు. టైం తక్కువగా ఉన్న మాట వాస్తవమే. అందుకే వేగంగా చేయగలిగే రీమేకుల కంటే వేరే మార్గం లేదు. వీరమల్లుకి ఏడాదిన్నరపైనే పడితే ఇప్పుడీ వినోదయ సితంకు నెల రోజులు సరిపోతుందట. అలాంటప్పుడు ఇది తప్పు ఇది ఒప్పని ఎంత ఫ్యాన్స్ అయినా సరే నిర్దేశించలేరు.