TDP YSR Congress MLC Electionsఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ సీట్లకు ఈరోజు జరిగిన ఎన్నికలలో టిడిపి ఒక సీటు గెలుచుకొని మరోసారి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులకు ఒక్కొక్కరికీ లెక్కప్రకారం 22 చొప్పున ఓట్లు పడగా, టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ ఒక్కరికే 23 ఓట్లు పడటం మరో విశేషం. సరిపడా ఎమ్మెల్యేల బలం ఉంది కనుక వైసీపీ ఏడు స్థానాలకు పోటీ చేయగా వాటిలో ఆరు మాత్రమే గెలుచుకొంది. టిడిపి ఒకే ఒక స్థానానికి పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్సీల కంటే ఒక ఓటు ఎక్కువగానే సాధించి విజయం సాధించింది.

ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులు సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, మర్రి రాజశేఖర్, ఏసు రత్నం, ఇజ్రాయెల్, పోతుల సునీత విజయం సాధించగా జయ మంగళ ఓడిపోయారు. టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో గెలిచారు.

టిడిపికి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మరో నలుగురు వల్లభనేని వంశీ, కరణం బలరామకృష్ణ మూర్తి, మద్దళి గిరిధర్, వాసుపల్లి గణేశ్ కుమార్‌ పార్టీకి దూరమయ్యారు.

ఇక వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ టిడిపికే ఓట్లు వేసి ఉంటారనేది బహిరంగ రహస్యం. కనుక వారిద్దరి ఓట్లతో కలిపితే టిడిపికి 21 ఓట్లు పడిన్నట్లు లెక్క తెలుతోంది. కనుక టిడిపికి దూరంగా ఉంటున్న నలుగురు ఎమ్మెల్యేలలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేశారా లేక వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేశారా?అనేది తెలియాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాలతో షాక్ అయిన వైసీపీ అధిష్టానం అప్పుడే పార్టీలో క్రాస్ ఓటింగ్ చేసిన ఆ కట్టప్పలు ఎవరో కనుగొనేందుకు తన ఎన్నికల వ్యూహం ప్రకారం పరిశీలిస్తోంది.

కనుక నిన్న చెప్పుకొన్నా ఉగాది రాజకీయ పంచాంగం ప్రకారం వైసీపీలో కొంతమందిపై వేటు పడే అవకాశం ఉందని భావించవచ్చు. ఈ ఎన్నికలలో విజయం సాధించడం టిడిపికి నిజంగా పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. ఇటువంటి సంక్లిష్టమైన ఎన్నికల ప్రక్రియలో ఏవిదంగా ఓట్లు రాబట్టుకోవాలో టిడిపి నేతలకు మంచి అనుభవం ఉంది. కనుక వారు చక్కటి వ్యూహం ప్రకారమే తమ అభ్యర్ధిని వైసీపీ అభ్యర్ధుల కంటే ఒక ఓటు ఎక్కువతో గెలిపించుకొని తమ సత్తా చాటుకొన్నారు.