సంక్రాంతి హడావిడి పూర్తిగా అయిపోయింది. జనాల రోజువారీ జీవితం మొదలైపోయింది. సెలవుల మూడ్ ని ఎంజాయ్ చేసిన పిల్లలు స్కూలు బాట పట్టారు. పెద్దలు ఆఫీస్ రూటు పట్టారు. టాలీవుడ్ కు కోట్ల కాసులు కురిపించే కల్పతరువుగా మారిపోతున్న ఈ సీజన్ ని ఈసారి చిరంజీవి బాలకృష్ణలు పూర్తిగా పిండేశారు. వాల్తేరు వీరయ్య అదిరిపోయే వసూళ్లతో విన్నర్ కప్పు గెలుచుకోగా వీరసింహారెడ్డి దాని బిజినెస్ కి తగ్గ బ్రేక్ ఈవెన్ ని సులభంగా దాటేసి సూపర్ హిట్ కొట్టింది. ఇప్పటికీ చాలా సెంటర్స్ లో రెండింటి వసూళ్లు బాగున్నాయి.
ఇవి రిలీజ్ కావడానికి ముందు జరిగిన థియేటర్ల పంచాయితీ అంత సులభంగా మర్చిపోయేది కాదు. వారసుడు కోసం దిల్ రాజు ఎక్కువ సంఖ్యలో వాటిని హోల్డ్ చేయడం, చివరి నిమిషంలో విడుదల తేదీని 11 నుంచి 14కి మార్చడం లాంటి అనూహ్య పరిణామాలు జరిగాయి. మైత్రి స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవడం ఒక ట్విస్టు అయితే అసలు ఊసులోనే లేని కళ్యాణం కమనీయంని యువి సంస్థ హఠాత్తుగా రేస్ లో దింపడం షాక్ ఇచ్చింది. సరే తెగింపు అంటే టైటిల్ కు తగ్గట్టు ఎంత వచ్చినా చాలని తెగించింది కనక దాని ప్రస్తావన పెద్దగా అవసరం లేదు.
ఇప్పుడు ఫలితాలు వచ్చేశాయి. ఫైనల్ గా చూస్తే ఈ రచ్చలో అందరూ గెలిచారు అందరూ ఓడారు. అవును. తక్కువ స్క్రీన్లున్న కేంద్రాల్లో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో వారసుడు, కళ్యాణం కమనీయంలకు థియేటర్లు కేటాయించడం వల్ల చిరు బాలయ్యల ఓవర్ ఫ్లోస్ చాలా మటకు వృథా అయ్యాయి. ఉదాహరణకు గడిచిన ఆదివారం హైదరాబాద్ లో సంతోష్ శోభన్ కు ఎనభై దాకా షోలు ఇస్తే ఏదీ కనీసం పాతిక శాతం ఫుల్ కాలేదు. వచ్చిన పది ఇరవై మందితో రన్ చేస్తే కనీసం థియేటర్ అద్దె రాని పరిస్థితి. వీటిని వీరయ్య, వీరసింహాలకు ఇచ్చి ఉంటే కనీసం మూడు నాలుగు కోట్లు అదనంగా వచ్చి ఉండేది.
ఇక్కడే కాదు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇదే సీన్ కనిపించింది. వారసుడుకి ఈ పరిస్థితి కొంత లాభం కలిగించింది కానీ అదీ పెద్దగా బావుకున్నది లేదు. రొటీన్ కంటెంట్ తో ఆ మాత్రం కలెక్షన్లు వచ్చాయంటే చాలా చోట్ల చిరు బాలయ్యలకు టికెట్లు దొరక్క విజయ్ సినిమా చూసిన ఉదంతాలే ఎక్కువని రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ గోలంతా లేకుండా కేవలం రెండు లేదా మూడు తెలుగు సినిమాలు మాత్రమే ఉండింటే ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవి. వాస్తవిక కోణంలో ఆలోచించకుండా ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటే పైకి ఎన్ని లాభాలు వచ్చినా దక్కాల్సిన అసలు ప్రయోజనం కంటే ఖచ్చితంగా తక్కువేనని చెప్పాలి.