When will these star heroes know what PR isముందో చిన్న పిట్టకథ చెప్పుకుందాం. దూరంగా కంటికి లీలగా కనిపించేలా గుర్రం వెళ్తోంది. నలుగురు కలిసి దాన్ని గాడిదనుకున్నారు. కాసేపయ్యాక ఇంకొకడు వచ్చి కాదు అది గుర్రమని చెప్పాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందరూ కలిసి మూకుమ్మడిగా లేదు అది గాడిదేనని పదే పదే వాదించేసరికి ఆ మిగిలినవాడు ఒప్పుకోక తప్పలేదు. దెబ్బకు అయిదు గొర్రెలు కలిసి ఒక గుర్రాన్ని గాడిద చేశాయన్న మాట. ఇది ఇప్పటి సోషల్ మీడియా లో ఉండే ఒక సెక్షన్ మూవీ ఫాన్స్ కి బాగా వర్తిస్తుంది. వీళ్ళకి తమ ఫేవరేట్ హీరోకి PR బాగా చేస్తున్నారనే వార్త వింటే అదేదో నెగటివ్ వార్తలా, మా హీరో ని తక్కువ చేస్తున్నారు తమకున్న మిడి మిడి జ్ఞానంతో ఊగిపోతారు.

అదెలాగో చూద్దాం. ఇండస్ట్రీలో పిఆర్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. కొంతకాలం క్రితం చనిపోయిన బిఏ రాజు లాంటి వాళ్ళు ఈ రంగంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సూపర్ స్టార్ కృష్ణే ఆయన్ని చేరదీసి ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఇక్కడ మరో కోణం ఉంది. ఒకప్పుడు వీళ్ళలో పలురకాలు ఉండేవారు. హీరోల మధ్య విపరీతమైన పోటీ నెలకొని కలెక్షన్లు, వంద రోజుల సెంటర్లే ప్రామాణికంగా ఉండే రోజుల్లో కొన్నిసార్లు లేనివి ఉన్నట్టుగా చూపడం ఫిగర్స్ ని హైక్ చేయడం ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగేవి. టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి శివరంజని, ట్రేడ్ గైడ్, జ్యోతిచిత్ర, సితార లాంటి పత్రికల్లో ఏదొస్తే అదే నిజమనే పరిస్థితి

కాలం మారిపోయింది. పిఆర్ పరిధి విస్తృతంగా పెరిగింది. వ్యవహారాలన్నీ స్టార్ల మేనేజర్లు చూసుకోవడం లేదు. బాధ్యతలు పంచుకోవడానికి పిఆర్ వ్యవస్థకు కొత్త బరువులు జోడించాల్సి వచ్చింది. వందల కోట్ల వ్యాపారంతో ముడిపడిన తమ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ సదరు స్టార్లు పర్సనల్ గా చూసుకోలేరు. గతంలో ఓ ప్రెస్ మీట్ పెట్టేసి లేదా ఆడియో ఫంక్షన్ లాంటిది చేసేసి వివరాలు చెప్పేస్తే సరిపోయేది. లేదూ జర్నలిస్ట్ లు సెట్స్ కి వచ్చినప్పుడు వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడి షూటింగ్ స్టిల్స్ కొన్ని ఇప్పించేసి తర్వాత పోస్టర్లు గట్రా మార్కెటింగ్ వ్యవహారాలన్నీ నిర్మాత చూసుకునేవాడు. ఇప్పుడంతా మారిపోయింది.

మీడియా విస్తృతంగా పెరిగిపోయింది. న్యూస్ ఛానల్స్, ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్, దినపత్రికలకు ధీటుగా వెబ్ మీడియా పెరిగింది. పుట్టగొడుగుల్లా యుట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. ట్విట్టర్ అప్డేట్స్ కోట్లాది ఫాలోయర్స్ క్షణక్షణం ఫాలో అవుతున్నారు. ఫేస్ బుక్ ని నోట్ బుక్ కంటే ఎక్కువగా చదివే యువత ఉంది. ఇన్స్ టాని వ్యసనంగా మార్చుకున్న వాళ్ళు చుట్టూ ఉన్నారు. సో ఇవన్నీ అనుసంధానం చేయడం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తంగా ఉండాలి. చిన్న పొరపాట్లు పెద్ద గాలిదుమారానికి దారి తీస్తాయి. ఇవన్నీ హీరోలు చూసుకునే టైం ఉండదు. పిఆర్ లు వీటిని అనుసంధానిస్తూ హీరోకు సొసైటీకి గ్యాప్ రాకుండా చూసుకోవాలి.

అంతే తప్ప ఏదో ఫేక్ కలెక్షన్లు చెప్పుకోవడానికో లేదా లేని ఇమేజ్ ని సృష్టించడానికో కాదు. ఆ మాటకొస్తే తన బ్రాండ్ మీద ఈజీగా బిజినెస్ జరుగుతున్నా ఎందుకు రాజమౌళి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటూ దేశ విదేశాలు తిరుగుతున్నారు. ఆయనకు ఆయనే పిఆర్ కాబట్టి. బాలీవుడ్ లో వీటికోసమే ప్రత్యేకంగా కంపనీలున్నాయి. లక్షల ఫీజులు చెల్లింది వీటి సేవలను పొందుతున్న హీరో హీరోయిన్లు కొల్లలు. సోషల్ మీడియా అకౌంట్లను సైతం వీళ్ళే మేనేజ్ చేస్తున్న దాఖలాలు బోలెడు. ఇవన్నీ వదిలేసి పిఆర్ అంటే ఏదో మాయలు చేసే జాదూగర్ లా ఆలోచించే పీతబుర్రలకు ఎంత చెప్పినా అర్థం కాదు. కామెడీ ఏంటంటే పీఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ (ప్రజా సంబంధాలు)అనే అర్థం తెలియకుండా వాదించే అరమేధావులకు లోటే లేదు.