when will pawan kalyan jana sena porata yatra resumeరంజాన్ పండగ అంటూ దాదాపుగా గడిచిన ఏడెనిమిది రోజుల నుండి రాజకీయాలకు జనసేన అధినేత దూరంగా ఉంటున్నారు. పోరాటయాత్ర పేరుతో సాగిస్తోన్న పర్యటనకు రంజాన్ సందర్భంగా బ్రేక్ ఇచ్చిన జనసేన అధినేత, మళ్ళీ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారనేది ఇంకా సెలవివ్వలేదు. ఈ ఏడెనిమిది రోజుల నుండి కూడా బాహ్యా ప్రపంచానికి అందుబాటులో లేకపోవడంతో, ‘పార్ట్ టైం పొలిటిషియన్’ అన్న విమర్శలకు మరోసారి తావిచ్చినట్లయ్యింది.

పోరాటయాత్రకు బ్రేక్ ఇచ్చిన తర్వాత ట్విట్టర్ ద్వారా అందుబాటులో ఉండాలని ప్రయత్నిస్తే… అది కాస్త ఫస్ట్ పోస్ట్ తోనే బెడిసికొట్టింది. దీంతో ట్విట్టర్ లో కనుమరుగయ్యారు. రంజాన్ శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రం ఓ స్టిల్ ని పోస్ట్ చేసిన పవన్, తదుపరి ప్రణాళిక ఏమిటన్నది వెల్లడించకపోవడంతో అభిమానులంతా ఎప్పుడు బరిలోకి దిగుతారోనని వేచిచూస్తున్నారు. బహుశా “అధిష్టానం” నుండి ఆదేశాలు రావాలేమో అనడం విమర్శకుల వంతవుతోంది!

పోరాటయాత్రలో దొర్లిన పొరపాట్లు రిపీట్ కాకుండా స్థానిక సమస్యలపై మరింత శ్రద్ధ పెట్టుకునేందుకే ఈ బ్రేక్ అంటున్నాయి జనసేన వర్గాలు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా, ప్రస్తుతం జనసేన అధినేత దానిపైనే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారన్న టాక్ ఉంది. అయితే మరో ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని ఇలా వారం, పది రోజుల పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉండడం మాత్రం సరైన నిర్ణయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.