Chiranjeevi can provoke Kapu community to violence?ముద్రగడకు సంఘీభావం తెలియజేసి, తద్వారా కాపు వర్గపు ప్రజల ఆదరణను చూరగొనాలని మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రయత్నం చివరికి విఫల యత్నంగానే ముగిసింది. ముద్రగడను కలిసేందుకు వీలు లేకుండా ప్రభుత్వం సత్వర ప్రణాళికతో అందరికీ కట్టడి చేయడంతో… చివరి నిముషంలో చిరంజీవి వంటి వారు ఆశించిన రాజకీయ లబ్ది నెరవేరకుండానే ముద్రగడ దీక్ష ముగిసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే చిరంజీవికి జరిగిన ఆపరేషన్ రీత్యా రావడం కాస్త ఆలస్యమైందని మెగా కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నా… ఒకవేళ అదే అయితే కనీసం ప్రెస్ మీట్ పెట్టి అయినా తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు కదా… అన్న భావాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘’ఆరోగ్య పరిస్థితుల రీత్యా తానూ అక్కడికి వెళ్లలేకపోతున్నానని చెప్తూ, తన అభిప్రాయాన్ని చెప్పినా” బాగుండేదన్న భావన సర్వత్రా వెలువడుతోంది. అయితే ఆ విధానాన్ని పవన్ ఇప్పటికే అనుసరించడంతో… అదే బాటలో చిరు కొనసాగలేక ప్రత్యక్షంగా ముద్రగడను కలుసుకోవాలని భావించి ఉంటారని పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్న టాక్.

ఏది ఏమైనా రాజకీయ రంగ ప్రవేశం చేసి, దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు గడుస్తున్నా, మెగాస్టార్ కు అసలు సిసలు రాజకీయం ఒంట పట్టలేదని, ఈ తరుణంలో ఇంకా ఏదో చేయాలని, ఏదో కావాలనే తపనలకు చిరు దూరంగా ఉండడం ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు. సినీ రంగంలో విమర్శలకు తావు లేకుండా మెగాస్టార్ జీవితం ఎంత దేదీప్యమానంగా వెలిగిపోయిందో, రాజకీయ రంగంలో ‘ఎదుగుదల’ అనే దానికి ఆస్కారం లేకుండా సాగిపోతోంది అన్నది అంతే వాస్తవమని రాజకీయ పండితులు కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్న భావాలు.