Ambat-Rambabu-YSRCPజగన్ క్యాబినెట్ పార్ట్-2లో జలవనరుల శాఖ మంత్రిగా పదవి చేపట్టిన కొత్తలో మంత్రి అంబటి రాంబాబు అవగాహనా రాహిత్యంతో పోలవరం ప్రాజెక్టు, డయాఫ్రం వాల్ గురించి తెలిసీతెలియకుండా మాట్లాడి నవ్వులపాలయ్యారు. కనుక మళ్ళీ అటువంటి అవమానం వద్దనుకొన్నారో ఏమో.. పెండింగ్ ప్రాజెక్టుల గురించి అవగాహన పెంచుకొనేందుకు ఆదివారం తిరుపతి జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కండలేరు జలాశయం గురించి అవగాహన పెంచుకొనేందుకు వచ్చాను. తెలుగు గంగ కాలువ ద్వారా జిల్లాలో చెరువులన్నీ నింపుతాము. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు రీటెండరింగ్ ప్రాసెస్‌లో ఉన్నందున ఆ పనులు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నాను,” అని చెప్పారు.

మంత్రులు తమ తమ శాఖలపై అవగాహన ఏర్పరచుకోవడానికి కొంత సమయం పడుతుంది. అదే సమయంలో సమర్ధంగా రాజకీయాలు కూడా చేస్తుండాలి లేకుంటే పదవులకు ఎసరు వచ్చేస్తుంది. ఇక మద్యలో గడప గడపకి వంటి కార్యక్రమాలు, సిఎం జగన్ పర్యటనలు, సభలు, సమావేశాలు ఉండనే ఉంటాయి. అయినప్పటికీ ఎలాగో తమ శాఖలపై అవగాహన ఏర్పరచుకొనేసరికి రెండేళ్ళు పూర్తవగానే మంత్రి పదవులు ఊడిపోతాయి. ఇదివరకు జలవనరుల శాఖ మంత్రిగా చేసిన అనిల్ కుమార్‌ పరిస్థితి ఇదే.

ఇప్పుడు ఆయన స్థానంలోకి వచ్చిన అంబటి రాంబాబుకి అట్టే టైమ్ లేదు. ఎందుకంటే మరో 7-8 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. అప్పుడు ప్రాజెక్టులు, టెండర్లు అని ఆలోచిస్తూ కూర్చోంటే మొదటికే మోసం వస్తుంది. కనుక మంత్రి అంబటి రాంబాబుకి రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఇంకా అవగాహన ఎప్పుడు వస్తుందో… ఈ రీటెండరింగ్ ప్రాసెస్ ఎప్పటికీ పూర్తవుతుందో… ఆ తర్వాత ప్రాజెక్టుల అధ్యయనం ఎప్పటికీ పూర్తవుతుందో తెలీదు, కానీ ఈలోగానే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అప్పుడు పోలవరం ప్రాజెక్టులాగే మిగిలిన ప్రాజెక్టులు కూడా ఎక్కడున్నావే గొంగళీ అంటే వేసిన చోటే పడున్నా,” అని చెప్పుకోవలసివస్తుందేమో?