Kalvakuntla Kavitha తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తెకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసు పంపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. మోడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన రాజకీయ ప్రత్యర్దులని ఈవిదంగా వేధిస్తోందని బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కల్వకుంట్ల కవితకి నోటీస్ ఇవ్వడం, అరెస్ట్ చేయాలనుకోవడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనంటూ ఈ కేసులో రాష్ట్ర ప్రజలను కూడా జోడించేస్తున్నారు.

మద్యం వ్యాపారాలు చేస్తూ, కుంభకోణానికి పాల్పడి తెలంగాణ ప్రజలకు తలవంపులు తెచ్చిపెట్టినందుకు సిగ్గుపడకపోగా కేంద్రాన్ని, బిజెపిని నిందిస్తారా? అంటూ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎదురుప్రశ్నిస్తున్నారు. ఇంకా వైఎస్ షర్మిలతో సహా మిగిలినవారు కూడా తలో రాయి వేస్తున్నారు.

అయితే ఇవన్నీ రొటీన్‌గా జరిగే రాజకీయాలే. కానీ ఈ కేసులో కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఏమవుతుంది? అని ఆలోచిస్తే, సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో, బిఆర్ఎస్ మంత్రులు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లతో, బయట బిఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోవడం ఖాయం. ముఖ్యంగా రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ శ్రేణులు ఉదృతస్థాయిలో ప్రచారం, పోరాటాలు మొదలుపెట్టవచ్చు.

ఇంతకాలం కేంద్రప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తోందని వాదిస్తున్న బిఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడమంటే తెలంగాణ ప్రజలని అవమానించడమే అని తీర్మానించి ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేయవచ్చు. సెంటిమెంట్ బలపడిన్నట్లనిపిస్తే ముందస్తు ఎన్నికలకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. కానీ అది చాలా రిస్క్ కనుక అది లాస్ట్ ఆప్షన్‌గానే తీసుకొంటారు.

ఇక కేసీఆర్‌, బిఆర్ఎస్‌తో కలిసివచ్చే పార్టీలు, వాటి నేతలు కలిసి దేశవ్యాప్తంగా పర్యటించి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రచారం చేయవచ్చు. మరోవిదంగా చెప్పాలంటే కేసీఆర్‌ ఈ అంశాన్ని జాతీయ రాజకీయాలలో ‘లాండింగ్’గా ఉపయోగించుకోవచ్చు.

కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ ఈవిదంగా చేస్తారని బిజెపి పెద్దలకు కూడా తెలుసు కనుకనే ఇంతకాలం ఆమె చుట్టూ ఉన్నవారిని అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఆమె జోలికి రాలేదు. కానీ అరుణ్ పిళ్ళైతో కలిపి ఆమెను విచారించిన తర్వాత బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టి కేసీఆర్‌ దూకుడుకి కేంద్ర ప్రభుత్వం కళ్ళెం వేసేందుకు ప్రయత్నించవచ్చు.

ఇది రాజకీయకోణంకాగా, న్యాయపరమైన పోరాటం మరోలా ఉంటుంది. ఈ కేసులో ఆమెని దోషి అని నిరూపించడానికే చాలా సమయం పట్టవచ్చు. ఒకవేళ నిరూపించినా ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఖాయం. ఈలోగా బెయిల్‌ తీసుకొని బయటకు వచ్చేస్తారు కూడా.

ఆర్ధిక నేరగాళ్ళు, హత్యానేరాలలో నిందితులే బెయిల్‌పై బయటకు వచ్చేసి, తాము రాజకీయ కుట్రలకు బలైపోయామని మొసలి కన్నీరు కార్చుతూ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. వారు జైలుకి వెళ్ళివచ్చినా ప్రజలు పెద్దమనసుతో వారిని అక్కున చేర్చుకొని ఓట్లు వేసి తమ భుజాలపై మోస్తున్నారు. నిందితులే పాలకులుగా పరిపాలన చేస్తుంటే, వారికే పోలీస్ వ్యవస్థ రక్షణ కల్పిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక ఈ కేసులో కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళినా అదొక పీడకలగానే గడిచిపోతుంది తప్ప ఆమె రాజకీయ ఎదుగుదలకి ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.