ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేన కూటమి ఎన్నికల తరువాత భవిష్యత్తు మాదే అంటూ హడావిడి చేసింది. అయితే తిరుపతి ఉపఎన్నిక తో అటువంటి ఆశలేమన్న ఉన్నా క్లియర్ అయిపోయాయి. ఆ తరువాత కూడా రెండు పార్టీలు ఏం చేస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి.
జనసేన విషయానికి వస్తే అసలు పార్టీ ఒకటి ఉందనే విషయాన్నే మర్చిపోయి పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ అయిపోయారు. సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ అన్నట్టు అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తూ ఉంటారు. ఇక బీజేపీ పరిస్థితి అయితే ఇంకో వెరైటీ.
ఆ పార్టీ గురించి చెప్పాలంటే నిన్న జరిగిన ఒక్క ఉదాహరణ చాలు… జనఆశీర్వాద్ యాత్ర పేరుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీలోని తిరుపతి, విజయవాడల్లో పర్యటించి ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని.. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
అంతవరకు బానే ఉంది ఆ వెంటనే… తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ని కలిసి శాలువాలు కప్పించుకున్నారు. రక్షణ శాఖకు చెందిన మంత్రికి అంత అర్జెంటు గా జగన్ ను కలవాల్సిన పని ఏముంటుంది? పోనీ కలవాలి అనుకుంటే కనీసం రాజకీయ పర్యటనకు వచ్చిన సమయంలో కాకుండా ఇంకో సమయంలో అధికారిక సమావేశం పెట్టుకోవాలి.
పైగా అప్పటిదాకా ఉన్న బీజేపీ నాయకులకు మాట మాత్రమైనా చెప్పకుండా మాయం అయిపోయి జగన్ ఇంట్లో ప్రత్యక్షం అయిపోయారు. ఇలా వ్యవహరించి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఎవరు పట్టించుకుంటారు? పవన్ కళ్యాణ్ అటు… వీళ్ళు ఇటు.. సరిపోయారు రా బాబు! అని అభిమానులు అనుకుంటున్నారు.