Bandla Ganesh Vijay Deverakondaనేను ఏ వివాదాల్లోకి రాను నా ప్రపంచం నాదంటూనే నటుడు కం ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఏదో ఒక విషయాన్ని తవ్వి తీసి మరీ నెటిజెన్లకు టార్గెట్ కావడం పలు అనుమానాలను లేవనెత్తుతోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ తన ఇంటి టెర్రస్ మీద తండ్రితో కలిసి క్యాజువల్ గా మాట్లాడుతున్న ఫోటోని ట్వీట్ చేశాడు. అందులో తండ్రి కొడుకుల బంధం కన్నా స్నేహితుల తరహా బాండింగ్ ఎక్కువ కనిపించింది. నిజానికి వాళ్ళ వ్యావహారిక శరీర బాష అధిక సందర్భాల్లో అలాగే ఉంటుంది. వాళ్లకు లేని అభ్యంతరం ఇంకొకరికి అనవసరం. అక్కడ ఉద్దేశాలు ఏవైనా సరే తప్పో ఒప్పో అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుంది. సామాన్యులు చేస్తే ఏ తంటా లేదు

ఈ ఫోటోనే బండ్ల గణేష్ రీ ట్వీట్ చేస్తూ కన్నవాళ్లను పూజించడం మన ధర్మమంటూ ఒక కొటేషన్ పెట్టి దాని పక్కనే తాను తండ్రిని కూర్చోబెట్టి క్షురకర్మ తాలూకు పిక్ ని పోస్ట్ చేశాడు. అంటే ఇదేదో విజయ్ దేవరకొండ నీతి వాక్యం చెబుతున్నట్టు ఉందని రకరకాల విశ్లేషణలు బయటికి వచ్చేశాయి. అంటే నువ్వు చేసింది కరెక్ట్ కాదు ఇలా చూసుకోవాలని అర్థం వచ్చేలా అన్నావని మరికొందరు డెఫినేషన్లు ఇచ్చేశారు. దీంతో సహజంగా రౌడీ హీరో అభిమానులకు మండేలా చేసింది. ఎందుకు మా హీరోని టార్గెట్ చేశావంటూ కామెంట్లతో పాటు రీ ట్వీట్లలో నిలదీయడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య పొసగకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే డౌట్లు వచ్చేశాయి

ఇక్కడితో కథ ఆగలేదు. హరికృష్ణ ముందు మోకాళ్ళ మీద కూర్చుని జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్న ఫోటోని బండ్లన్న షేర్ చేశారు.అంటే ఎలా ఉండాలో చెప్పే మరో ఉదాహరణ అన్న మాట. మరికొందరు ఒక అడుగు ముందుకేసి చెక్ బౌన్స్ కేసుల్లో అభియోగాలు ఎదురుకుంటున్న వాళ్ళు ఇలా తండ్రుల మీద నీతులు చెప్పడం భలే ఉందని కౌంటర్లు వేస్తున్నారు. గతంలో సచిన్ జోషితో వచ్చిన కాంట్రావర్సీని ఉదహరిస్తున్నారు. మరోవైపు లైగర్ కు సంబంధించిన పెట్టుబడుల్లో అక్రమాలు జరిగాయని ఇటీవలే ఈడి విజయ్ దేవరకొండను గంటల తరబడి ప్రశ్నించడం ఇంకా ఫ్రెష్ గానే ఉంది. ఇలా అన్నింటిని ముడి పెట్టేస్తున్నారు

అసలు బండ్ల గణేష్ కు విజయ్ దేవరకొండతో ఏమైనా చెడిందా, లేక అతనితో సినిమా చేసే ప్రయత్నం విఫలమైనందుకు ఇలా ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేస్తున్నాడా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. లైగర్ కు ముందు ప్రీ రిలీజ్ లో అయ్యెవరో తాతెవరో తెల్వకపోయిన నన్ను ఆదరిస్తున్నారని రౌడీ హీరో అన్న టైంలోనూ గణేష్ నుంచి వ్యంగ్యాస్త్రాలు పడ్డాయి. పబ్లిక్ స్టేజి మీద పవన్ కళ్యాణ్ మీద ఊగిపోయే బండ్లన్న ఇలా ట్విట్టర్ లో మాత్రం దోబూచులాడటం వెరైటీగా ఉంది. అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారని ఆయన పదే పదే అంటున్నా జరుగుతున్నవి కళ్ళముందు కనిపిస్తున్నపుడు బుకాయించినంత మాత్రాన నిజం అబద్ధమవుతుందా.