What Is the Credibility, Mr. IYR Krishna Raoఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కలకలం రేపిన ఘటన. చంద్రబాబు సర్కార్ నియమించిన కీలక పదవిలో ఉండి, అదే ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగిన విషయం కాదన్నది ఐవైఆర్ చేసిన వ్యాఖ్యలే చెప్తున్నాయి. సోషల్ మీడియాలో టిడిపిని టార్గెట్ చేస్తూ… వైసీపీకి అనుకూలంగా పోస్ట్ లు చేసే ఇంటూరి రవికిరణ్ అరెస్ట్ అయినపుడే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయ్యిందన్న విషయాన్ని పరోక్షంగా ఐవైఆర్ నేటి ప్రెస్ మీట్ లో చెప్పకనే చెప్పారు.

నాడు రవికిరణ్ ను అరెస్ట్ చేయడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ఐవైఆర్ స్పష్టంగా చెప్పడంతో… దీని వెనుక ఉన్న డొంకను కదిల్చే ప్రయత్నంలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏ విధంగా అయితే రవికిరణ్ ను అరెస్ట్ చేసి వైసీపీని సోషల్ మీడియా ద్వారా దెబ్బకొట్టిందో, అదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని టిడిపిని దెబ్బకొట్టే జగన్ ప్రయత్నంలో భాగంగా ఐవైఆర్ బలయ్యారా? అన్న చర్చలు రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నాయి. మరో పక్కన సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది.

వచ్చే ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుని, టిడిపి సర్కార్ కు ఐవైఆర్ నమ్మక ద్రోహం చేసారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనికి కూడా బ్యాక్ గ్రౌండ్ లో ఐవైఆర్ చేసిన వ్యాఖ్యలు లేకపోలేదు. నేటి ప్రెస్ మీట్ లో… ఎవరూ ఏమీ అడగకుండానే, తాను వైసీపీ నుండి పోటీ చేయడం లేదని, అంత అంగబలం కాని, అర్ధబలం కానీ తనకు లేవని ఐవైఆర్ చెప్పుకొచ్చారు. ఇదంతా గమనిస్తుంటే… జగన్ చేతిలో ఓ పావులా ఐవైఆర్ మారారన్న భావాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే జగన్ కు కోవర్టుల మాదిరి వ్యవహరిస్తున్న వారి జాబితాలో ఐవైఆర్ ఒక్కరే ఉన్నారా? లేక ఈ జాబితా పెద్దదేనా? దీనిపై బాబు దృష్టి సారించకపోతే మున్ముందు చాలా కష్టమవుతుంది మరి! వైఎస్సార్ పుణ్యమా అంటూ రాజకీయాలలో కోవర్టులు భారీ సంఖ్యలో రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఒక్క కోవర్టుల ద్వారానే ప్రజారాజ్యం పతనమైందని పొలిటికల్ వర్గాల టాక్. అయితే అపర చాణుక్యుడిగా భావించే చంద్రబాబు ముందు ఇంత పప్పులు ఉడకకపోయినా… ఐవైఆర్ లాంటి వారు చేసే డేంజర్ కనపడనివ్వదన్న విషయాన్ని గుర్తించాలి.