what is secret of atom bomb between rajamouli keeravaniప్రస్తుతం సినీ ప్రేక్షక లోకమంతా “ఆర్ఆర్ఆర్” మేనియాలో మునిగి తేలుతోంది. అంచనాలకు మించి ఉన్న ఈ సినిమా గురించి విడుదల గురించి చిత్ర యూనిట్ చెప్పిందేంటి? రిలీజ్ తర్వాత ఆ మాటలకు తగిన విధంగా సినిమా ఉందా? లేదా? అని బేరీజు వేసుకునే పనిలో నెటిజన్లు ఉన్నారు.

ఇంటర్వెల్ తర్వాత ఒక సన్నివేశం ఉంటుందని, దానిని ఇప్పటివరకు టీజర్ లో గానీ, ట్రైలర్స్ లో గానీ చూపించలేదని, కానీ ఆ సన్నివేశం వచ్చిన తర్వాత ప్రేక్షకులంతా అబ్బుర పడతారని ఓ బాలీవుడ్ ప్రమోషన్ ఈవెంట్ లో స్వయంగా రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇది సంక్రాంతికి విడుదల అనుకున్న సమయంలో జక్కన్న చేసిన వ్యాఖ్యలు.

ఇక ఇటీవల కీరవాణి – రాజమౌళిలు కలిసి చేసిన ఇంటర్వ్యూలో సినిమాలోని హైలైట్ సీన్స్ ని ‘జీడిపప్పు’ అని పేర్కొంటుంటారని, కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాన్ని మాత్రం ‘ఆటంబాంబ్’గా పేర్కొంటూ కీరవాణి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ రిలీజ్ కు ముందు మ్యాటర్లు… మరి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కదా!

ఇంతకీ ఆ “ఆటంబాంబ్” ఏంటి? అన్న చర్చ ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది. కొందరేమో జూనియర్ ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ‘కొమురం భీముడో’ అన్న పాట గురించి జక్కన్న – కీరవాణీలు చెప్పి ఉంటారని అంటుంటే, మరికొందరేమో చెర్రీ – తారక్ లు కలిసి చేసే ఫైట్ గురించి చెప్పి ఉంటారని సోషల్ మీడియాలో వాదనలు మొదలుపెట్టారు.

ఆఫ్ లైన్ లో సినిమాను ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేస్తుండగా, సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి వింత వాదనలు తెరపైకి వచ్చాయి. విశేషం ఏమిటంటే… నెట్టింట చెప్పబడుతున్న ఈ రెండు సన్నివేశాలు కూడా తెరపై అద్భుతమైన ఏమోషన్స్ ను పండించినవే. ఈ రెండూ కూడా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలే కావడం మరో విశేషం.

మరి ఈ “ఆటంబాంబ్”పై ఉన్న సందేహాలు వీడాలంటే దర్శకధీరుడు జక్కన్నో, పెద్దన్న కీరవాణినో పెదవి విప్పాలి. అప్పటివరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ ‘ఆటంబాంబ్’తో నింపాదిగా ఆడుకోవచ్చు, వీక్షకులు ఎంజాయ్ చేయవచ్చు.