‘నేను ప్రభుత్వాలకు కాదు… ప్రజలకు సేవ చేస్తానని…’ పంచ్ డైలాగ్ పేల్చుతూ విశాఖపట్టణం వేదికగా సింపోజియంలో జరిగిన సభలో పవన్ ప్రసంగానికి విశేషమైన ఆదరణ లభించింది. మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమని, సమస్యను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నప్పుడు దానిని పరిష్కరించకుండా విమర్శలు చేసుకుంటుండడం హాస్యాస్పదమని, ఉద్ధానం ప్రజల సమస్యలను పరిష్కరించాలని పవన్ సూచించారు.

ఇలాంటి సమస్యల పరిష్కారంలో తాను నిపుణుడ్ని కాదని, అయితే తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తినని, ఎంతో మంది నిపుణులు, మేధావులు, పరిశోధకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించలేరా? ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయితే ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని భావించి ఈ విషయంలో స్పందించానని అన్నారు.

ఇక ప్రసంగం చివర్లో… “జనావాసాల మధ్య బ్రాంది షాపు పెట్టరాదు” అనే క్యాప్షన్ తో కూడిన ప్లకార్డును పట్టుకుని మౌనంగా చిరునవ్వులు చిందించారు పవన్. ఏపీలోని సరికొత్త మద్యం పాలసీలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు ఇస్తున్నారని, అవి జనావాసాల మధ్య ఉండడంతో మద్యం కారణంగా కుటుంబాలు నాశనమైపోతున్నాయని వస్తున్న ఆందోళనలు తెలిసినవే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ప్లకార్డు ప్రదర్శించడంతో… ‘జనసేన’ తదుపరి పోరాటం దీని పైనే అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.