Gollapudi TDPఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడిలో టిడిపి కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని, బయట ఫ్లెక్సీ బ్యానర్లని, లోపల కంప్యూటర్స్, ఫర్నీచర్ వగైరాలని తరలిస్తున్నారు. టిడిపి కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అనే బోర్డుని కూడా తగిలించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమాతో సహా పలువురు పార్టీ నేతలని పోలీసులు గృహనిర్బందం చేసి, కార్యకర్తలని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. గొల్లపూడిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులని మోహరించారు.

ఇంతకీ వివాదం ఏమిటంటే, టిడిపికే చెందిన బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కుటుంబానికి చెందిన భవనంలో టిడిపి కార్యాలయం ఉంది. వారి కుటుంబానికే చెందిన ఆలూరి చిన్న కూడా టిడిపిలోనే ఉంటున్నారు. ఆయనే పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన తల్లి ఆలూరి శేషారత్నం తమ భవనాన్ని తనకి అప్పగించాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం తహసీల్దార్‌కి వినతిపత్రం ఇచ్చారు. కనుక ఈ నెల 28వ తేదీలోగా తల్లీకొడుకులు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని తహసీల్దార్‌ సూచించారు. కానీ ఇంకా పదిరోజులు గడువు ఉండగానే పోలీసులు నిన్న రాత్రే టిడిపి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొన్నారని ఆలూరి చిన్నా, దేవినేని ఉమా తదితరులు ఆరోపిస్తూ నిరసనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆలూరి శేషారత్నం విలేఖరులతో మాట్లాడుతూ, “మేమూ టిడిపిలోనే ఉన్నాము. టిడిపి కోసం ఆస్తులు అమ్ముకొన్నాము. కానీ ఇంకా ఇవ్వడానికి మావద్ద భారీగా ఆస్తులేమీ లేవు. నా కొడుకు చిన్నా మంచివాడే కానీ నాకూతురికి అన్యాయం జరగకూడదని మాకున్న ఆ ఒక్క ఆస్తిని కాపాడుకోవాలనుకొంటున్నాము. అందుకు దేవినేని ఉమ అభ్యంతరం చెప్పడం సరికాదు,” అని అన్నారు.

విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నానియే ఆమెని ప్రోత్సహించి టిడిపి కార్యాలయాన్ని ఖాళీ చేయించారని దేవినేని ఉమ, బోండా ఉమా తదితరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో కేశినేని పాల్గొన్నప్పుడు, పార్టీలో దేవినేని ఉమ వ్యతిరేకవర్గంగా భావిస్తున్న బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కుటుంబానికే తన మద్దతు అని ప్రకటించారు. వచ్చే ఎన్నికలో బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కుటుంబానికి టికెట్‌ ఇవ్వాలన్నారు. వారి కుటుంబం 70 ఏళ్లుగా రాజకీయాలలో ఉందని, చిరకాలంగా టిడిపిలో కూడా ఉందని కనుక ఈసారి తప్పకుండా వారి కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలన్నారు.

అంతకు ముందు రోజు కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ, “జిల్లాలో (దేవినేని ఉమ, బోండా ఉమా) ముగ్గురు నలుగురు టిడిపి నేతలకి వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇస్తే తాను వారికి, పార్టీకి సహకరించనని, తనకి టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని హెచ్చరించారు.

కనుక ఆయనే గొల్లపూడిలో ఆ స్థలయజమాని ఆలూరి శేషారత్నంని ప్రోత్సహించి టిడిపి కార్యాలయాన్ని ఖాళీ చేయించి ఉండవచ్చని టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. టిడిపికి కంచుకోటవంటి ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ వివాదం ఇంకా ఇలాగే కొనసాగితే పార్టీకి తీరని నష్టం కలిగే అవకాశం ఉంది కనుక చంద్రబాబు నాయుడు వెంటనే కలుగజేసుకోవడం చాలా అవసరం.