what happened to kcr federal frontకర్ణాటకకు నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కుమారస్వామి తన తాజా ఇంటర్వ్యూలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ తో కలిపించి లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు.

ఈ సలహా గతంలో కేసీఆర్ చెప్పిన బీజేపీ, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ సూత్రాలకే వ్యతిరేకం. అయితే చాలా మంది అన్నట్టుగానే కేసీఆర్ కు కాంగ్రెస్ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం కుదరదని తేలిపోయిందా? కర్ణాటక ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ కు మద్దత్తు ఇచ్చిన జేడీఎస్ ఇప్పుడు కాంగ్రెస్ తో చేరకతప్పని పరిస్థితి రావడంతో కేసీఆర్ కు తత్వం బోధపడి ఉండాలి.

ఫెడరల్ ఫ్రంట్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్న అన్ని పార్టీలు కాంగ్రెస్ తో కలిసి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లాయి. దీనితో కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కొన్ని రోజులు పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో ఆ పార్టీతో ఓపెన్ గా పని చేసే అవకాశం లేదు కేసీఆర్ కు.

నిన్న రైతుల ఇన్సూరెన్సు స్కీం గురించి ఎల్ఐసీ తో ఒప్పందం చేసుకున్న సంధర్భంగా కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి గాని ఫెడరల్ ఫ్రంట్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. మాములుగా అయితే ఇదే పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తామని ఆయన చెప్పేవారు. దీనితో ఫెడరల్ ఫ్రంట్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టారా అనిపించకమానదు.