What does YCP want to achieve by chasing Pawan Kalyanజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విషయంలో వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కాస్త అతిగానే వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కాస్త ఆవేశపరుడైన పవన్‌ కళ్యాణ్‌ని రాజకీయంగా ర్యాగింగ్ చేస్తూ రెచ్చగొడుతూ ఆయన నోరు జారేలా చేస్తూ, మళ్ళీ వాటిపై మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యంగ్యంగా మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అవహేళన చేస్తూ సందేశాలు పెడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జగన్ ప్రభుత్వం రోడ్లు విస్తరణ పేరుతో జనసేన, టిడిపిలకు చెందిన మద్దతుదారుల ఇళ్ళు కూల్చివేసినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ హుటాహుటిన అక్కడకు చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి, జగన్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సరిగ్గా అందుకోసమే కాసుకూర్చోన్నట్లు వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు ‘ప్యాకేజ్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌’ అంటూ అవహేళనగా మాట్లాడారు.

ఈవిదంగా పవన్‌ కళ్యాణ్‌ని పోలిటికల్ ర్యాంగింగ్ చేయడం ద్వారా టిడిపికి దగ్గరవకుండా చేయాలని వైసీపీ వ్యూహం కావచ్చు. అయితే పవన్‌ కళ్యాణ్‌ని టిడిపికి దూరంగా ఉంచాలనే ప్రయత్నంలో వారు పవన్‌ కళ్యాణ్‌ని అవహేళన చేస్తున్నకొద్దీ ప్రజలలో, ముఖ్యంగా ఆయన అభిమానులలో, కాపు సామాజిక వర్గంలో పవన్‌ కళ్యాణ్‌ పట్ల సానుభూతి పెరుగుతోంది. తాము అప్రయత్నంగా రాష్ట్రంలో జనసేనకు ప్రజాధారణ, బలం పెరిగేలా చేస్తున్నామనే సంగతి దేశముదురు వైసీపీ నేతలు గ్రహించ లేదనుకోలేము. కానీ పవన్‌ కళ్యాణ్‌ని ర్యాంగింగ్ చేయడానికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వారు వదులుకోవడం లేదు. అంటే దీని వెనుక మరో బలమైన కారణం ఏదో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో పవన్‌ కళ్యాణ్‌కి మద్దతు పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కనుక పవన్‌ కళ్యాణ్‌లో తాము ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రాలేకపోయినా తప్పకుండా ఎక్కువ సీట్లు గెలుచుకోగలమనే నమ్మకం పెంచగలిగితే, టిడిపికి దూరంగా ఉంటారని వైసీపీ ఆలోచన కావచ్చు. అలాగే ఈ వేధింపులు భరించలేక పవన్‌ కళ్యాణ్‌ బిజెపినే అంటిపెట్టుకొని ఉండేలా చేయాలనే ఆలోచన కూడా కనిపిస్తోంది.

అప్పుడు బిజెపి, జనసేనలు వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్ధులను నిలబెడితే గత ఎన్నికలలోలాగే మళ్ళీ ఓట్లు చీలి జనసేన, బిజెపిలతో పాటు టిడిపి కూడా తీవ్రంగా నష్టపోతుంది. అప్పుడు వైసీపీ మళ్ళీ మెజార్టీ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో అధికారంలో కొనసాగగలదు. బహుశః వైసీపీ వ్యూహం ఇదే కావచ్చు. కనుక పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.