What did the YCP government finally achieve?సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వరరావుని జగన్ ప్రభుత్వం ఎంత వద్దనుకొన్నా చివరికి ఆయనకు పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఏబీ వేంకటేశ్వరరావు తన సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి భద్రతా ఉపకరణాలు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం 2020లో సస్పెండ్ చేసింది. దానిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ 2020, మే 22వ తేదీన తీర్పు చెప్పింది.

అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జస్టిస్ ఏఎం.కన్వీల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ కేసుపై విచారణ లోతుగా జరిపిన తరువాత ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి, 2022, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయనకు ఐపిఎస్ అధికారి హోదాలో అన్ని సదుపాయాలు, ప్రయోజనాలు కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక తప్పనిసరిగా ఆయనకు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకతప్పలేదు.

అయితే రెండేళ్ళపాటు తనతో న్యాయపోరాటం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టిందని, తనను ఓడించేందుకు ఇంత ప్రజాధనం వృధా చేయడం సమంజసమేనా?దీనిని వైసీపీ ప్రభుత్వం ఏవిదంగా సమర్ధించుకోగలదు? అని ఏబీ వేంకటేశ్వర రావు ప్రశ్నకు వైసీపీ ఇంతవరకు జవాబు ఇవ్వనేలేదు కానీ చివరికి వద్దనుకొన్న అధికారినే ఉద్యోగంలోకి తీసుకోకతప్పలేదు.