What did Jagan Mohan Reddy achieve by going to NITI Aayogఢిల్లీలో నిన్న ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఏపీ సిఎం జగన్‌ ఆ సమావేశాన్ని తన ప్రభుత్వం గొప్పలు చెప్పుకొనేందుకు దొరికిన వేదికగానే భావించడంతో అక్కడా సొంత డప్పు కొట్టుకొన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవని, అంతా సస్యశ్యామలంగా ఉందని, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోది, మిగిలిన రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌ అన్నివిధాల మెరుగుగా ఉందనే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి తెలియనివి కావు. కానీ ఏ సమస్యలు లేవన్నట్లు నీతి ఆయోగ్ సమావేశంలో సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడి కేంద్రానికి, ఏపీ బిజెపికి తన ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే అవకాశం కల్పించినట్లయింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు అయినా ఇంతవరకు రాజధాని నిర్మాణం పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టు అర్దాంతరంగా నిలిచిపోయింది. ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రులు పార్లమెంటులో పదేపదే చెపుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో అడగలేదు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మేస్తోంది. వద్దని చెప్పలేదు. రాష్ట్రంలో కొత్తగా రైల్వే ప్రాజెక్టులు ఎందుకు మంజూరు చేయడం లేదని అడగలేదు. జాతీయ రహదారులు నిర్మించవలసి ఉందని చెప్పలేదు. జీఎస్టీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ బాదుడుతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. ఎందుకంటే పుణ్యకాలం కాస్తా సొంత డప్పుకే సరిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ వాటన్నిటిపై దుప్పటి కప్పి దాచేసి ఆంధ్రప్రదేశ్‌లో ఏ సమస్యలు లేవు అభివృద్ధి, సంక్షేమ పధకాలతో దూసుకుపోతోందన్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.

కీలకమైన ఈ సమావేశంలో మమతా బెనర్జీవంటివారు రాష్ట్రాలపై కేంద్రం కర్ర పెత్తనం చేయడం గురించి కూడా నీలదీశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి నీతి అయోగ్ సమావేశానికి వెళ్ళి చెప్పలేకపోయిన మాటలను, తెలంగాణ సిఎం కేసీఆర్‌ సమావేశానికి వెళ్ళకుండానే శనివారం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి చాలా వివరంగా చెప్పి కేంద్ర ప్రభుత్వం తీరును, నీతి ఆయోగ్ తీరును ఎండగట్టారు.

సిఎం కేసీఆర్‌ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనకపోయినా దానిపై తీవ్ర ప్రభావం చూపగలిగారు. ఆయన చేసిన తీవ్ర విమర్శలు, ఆరోపణలపై నీతి ఆయోగ్ వెంటనే స్పందించక తప్పలేదు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి సమావేశానికి వెళ్ళామా… ఫోటోలు దిగామా… సొంత డప్పు కొట్టుకొని వచ్చామా… అన్నట్లు ఇంత కీలకమైన సమావేశాన్ని మమ అనిపించేశారు.