West Indies match-winner Lendl Simmonsగేల్ ను కట్టడి చేస్తే చాలనుకున్న ఇండియన్ బౌలర్స్ కు సిమ్మన్స్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందన్న సంగతిని గుర్తించలేకపోయారు. నిజానికి టీ 20 వరల్డ్ కప్ లో సిమ్మన్స్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ఫాంలో ఫ్లెచర్ ను కాదని విండీస్ టీం సిమ్మన్స్ ను జట్టులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం… ముంబై స్టేడియం గురించి సిమ్మన్స్ కు తెలిసినంతగా ఆ జట్టులో మరొకరికి తెలియకపోవడమే.

ముంబై ఇండియన్స్ తరపున బ్యాటింగ్ చేసే సిమ్మన్స్ కు వాంఖేడే స్టేడియం ఆణువణువూ తెలుసు. దాదాపు నాలుగైదు ఏళ్ళుగా ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగి రాణిస్తుండడంతో సిమ్మన్స్ పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విండీస్ ను విజయతీరాలకు చేర్చాడు. ‘నో’ బాల్స్ రూపంలో ‘అదృష్టం’ కలిసి రావడంతో విజయంలో కీలక పాత్ర పోషించింది. బహుశా టీమిండియాను ఇంటికి పంపించడానికే సిమ్మన్స్ ను జట్టులోకి తీసుకున్నారేమో అన్న భావన కలగడం సహజమే.

51 బంతులను ఎదుర్కొన్న సిమ్మన్స్ 7 ఫోర్లు, 5 సిక్సర్లు, 2 నో బాల్స్ తో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒకానొక సమయంలో ఓడిపోతుందనుకున్న విండీస్ విజయానికి అండదండగా నిలిచిన ఘనత సిమ్మన్స్ కే దక్కుతుంది. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సిమ్మన్స్ వశమే అయ్యింది. ఈ అనూహ్య విజయంతో ఫైనల్లో కూడా ఇలాగే చెలరేగి వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలని విండీస్ జట్టు ఊవ్విళ్ళూరుతోంది.