Welfare schemes are ok but What about developmentవైసీపీ ప్రభుత్వంలో సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలందరూ నిత్యం మాట్లాడే అంశాలు రెండే రెండు. ఒకటి తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు. రెండు టిడిపి, చంద్రబాబు నాయుడుల గురించి.

కొత్తగా అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వామైన నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అయితే మూడేళ్ళు పూర్తవుతున్నా వైసీపీ ప్రభుత్వం ఏమి సాధించింది అంటే, ఎడాపెడా అప్పులు చేస్తూ సంక్షేమ పధకాలను అమలుచేయడం, వాటి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తుండటం. సమాజంలో నిరుపేద వర్గాలకు ప్రభుత్వం సాయపడటం అభినందనీయమే.

కేవలం బడుగు బలహీన వర్గాలను ‘ఉద్దరించాలనే తపనతోనే’ వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి మరీ ఈ సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నా అందరూ సంతోషించి ఉండేవారు. కానీ తమ సంక్షేమ పధకాలే తమ పార్టీకి శ్రీరామరక్ష… అవే వచ్చే శాసనసభ ఎన్నికలలో తమ పార్టీని గెలిపిస్తాయని సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలూ అందరూ బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. అంటే తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసమే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి మరీ సంక్షేమ పధకాల పేరిట లక్షల కోట్ల రూపాయలు పప్పుబెల్లాలా పంచిపెడుతోందని స్పష్టం అవుతోంది.

నగర, పట్టణ ప్రజలను, ఇతర వర్గాల ప్రజలను ఒప్పించి తమ పార్టీకే ఓట్లు వేయించుకోవడం చాలా కష్టం కనుకనే బడుగు బలహీనవర్గాలకి సంక్షేమ పప్పు బెల్లాలు పంచిపెట్టి వారిని ప్రసన్నం చేసుకొని వారి ఓట్లు పొందాలనేది వైసీపీ ప్రభుత్వం వ్యూహంగా చెప్పవచ్చు. పైగా ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అత్యధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి గంటల తరబడి ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేసేది కూడా వారే. కనుకనే సిఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభలో సంక్షేమ పధకాల క్యాలండర్ ప్రకటించారు కూడా!

పోనీ ఓట్ల కోసమే సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నా వాటి కోసం బలమైన ఆదాయ వనరులను ప్రభుత్వం సృష్టించుకొని ఉంటే ఎవరూ ఈవిదంగా వేలెత్తి చూపేవారే కాదు. కానీ ‘రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోకపోయినా సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నామని మంత్రులే నిసిగ్గుగా చెప్పుకొంటుంటారు.

ఈ మూడేళ్ళలో సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా ప్రభుత్వంలో ఎవరూ కూడా రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణం గురించి పెద్దగా మాట్లాడడింది లేదు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలను రప్పించడం గురించి మాట్లాడరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌ వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు కనుక. ఎందుకు చూడటం లేదు?వారికే తెలుసు.

కనుక అభివృద్ధి ప్రస్తావన చేసి నవ్వులపాలవడం కంటే తమకు కొట్టిన పిండి వంటి సంక్షేమ పధకాల గురించి గట్టిగా మాట్లాడుతున్నారనుకోవలసి ఉంటుంది.