Weekend holiday for telangana policeరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు … వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ సన్నిహితంగా మెలుగుతూ ఒకమాట మీద ముందుకు పోతున్నారు. ఇప్పుడు జగన్ తెచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పుని కేసీఆర్ తెలంగాణాలో కూడా అమలు చెయ్యబోతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని అనుసరించి జగన్ అధికారంలోకి రాగానే పోలీసులకు వారాంతపు సెలవులను అమలులోకి తెచ్చారు.

ఇప్పుడు తెలంగాణాలో అదే తీసుకురాబోతున్నారు కేసీఆర్. పోలీసులకు వారాంతపు సెలవు ఇచ్చేందుకు సిద్ధమైంది పోలీసు డిపార్టుమెంటు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటగా పశ్చిమ మండల పరిధిలో హోంగార్డు నుంచి ఏఎస్సై స్థాయి అధికారి వరకు ఈ వారాంతపు సెలవును వర్తింపజేయాలంటూ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు సూచించారు.

ఈ బాధ్యతలను డివిజన్‌ ఏసీపీలు పర్యవేక్షించాలన్నారు. పశ్చిమ మండల పరిధిలో పీసీలు 821, హెడ్‌ కానిస్టేబుళ్లు 92, హోంగార్డులు 321, మహిళా హోంగార్డులు 17, మహిళా పోలీసులు 38, ఏఎస్సైలు 73 మంది వారాంతపు సెలవును పొందనున్నారు. ప్రస్తుతం ఉన్న పోలీసు రూల్స్ ప్రకారం ప్రతీ పోలీసు అధికారి 365 రోజులు… 24 గంటలూ డ్యూటీలో ఉన్నట్టే.

వారు తమ షిఫ్ట్ అయిపోయినా అవసరమైన సందర్భంలో డ్యూటీకి రావాల్సి ఉంటుంది. అలాగే వారాంతపు సెలవులు ఉండవు. దీనితో వారి ఆరోగ్యం మీద అది పెను ప్రభావం చూపిస్తుంది. అలాగే వారి కుటుంబ సంబంధాల మీద కూడా ఒక్కోసారి పెను ప్రభావం చూపిస్తుంది. దాని వల్ల ఈ నిర్ణయం హర్షించదగినదే.