Watchman  murdered in Jayalalithaa Kodanadu Tea Estateదివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఊటీలో ఉన్న ‘కొడనాడ్’ ఎస్టేట్ లో వాచ్ మెన్ గా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆపై ఆమె ఆస్తులకు సంబంధించిన కీలకమైన దస్తావేజులు, డాక్యుమెంట్లను దగ్ధం చేశారు. దుండగుల దుశ్చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించినందునే వాచ్ మెన్ ను హత్య చేశారని తెలుస్తోంది. ఈ ఎస్టేట్ విలువ సుమారు 1000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

ఈ హత్యపై విచారణ జరిపేందుకు 10 మందితో కూడిన పోలీసుల బృందం ఊటీ ఎస్టేట్ కు చేరుకుంది. హత్య, ఆస్తి పత్రాల దగ్ధంపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు, హత్యపై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన బహదూర్ అనే వాచ్ మెన్ సహాయకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆస్తి పత్రాలు దహనం అయిన విధానాన్నీ పరిశీలిస్తున్నారు. ఏఏ ఆస్తులకు సంబంధించిన పత్రాలను తగులబెట్టారన్న విషయమై, ఎస్టేట్ లోని మిగతా పనివాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించే దిశగా ప్రశ్నిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, ఫోరెన్సిక్ నిపుణులతో పాటు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఇటీవలి కాలంలో జయలలిత ఆస్తులకు చెందిన పత్రాలను దహనం చేస్తుండటంపై ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాచ్ మెన్ సహాయకుడు కోలుకుంటే, ఈ కేసులో కీలక వివరాలు లభ్యం కాగలవని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం చెన్నైలోని జయలలిత గెస్ట్ హౌస్ లోనూ జయ ఆస్తి డాక్యుమెంట్లు కొన్ని తగులబడిన సంగతి తెలిసిందే.