War Trailer Talkబాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వార్‌’. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కాసేపటి క్రితం విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ రేకెత్తించింది. ట్రైలర్ ను బట్టి సినిమా విజువల్స్ హాలీవుడ్ చిత్రాల మాదిరి ఉందని చెప్పొచ్చు. అలాగే యాక్షన్ బ్లాక్స్ కూడా అదిరిపోయాయి. యాక్షన్‌కు పెట్టింది పేరు హృతిక్‌, టైగర్‌… వారిద్దరిని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవడం లేదంటున్నారు అభిమానులు.

హృతిక్‌, టైగర్‌ మధ్య వచ్చే భారీ పోరాట సన్నివేశాలు, ఉత్కంఠ రేకెత్తించే కార్‌ ఛేజింగులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ చూసినవారు డైలాగ్స్ కొంచెం రొటీన్ గా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. సరైన ఎలివేషన్ లేదని వారి ఒపీనియన్. అది అలా ఉంచితే కొందరు బాలీవుడ్ అభిమానులు మాత్రం బాహుబలి 2, సాహూ చిత్రాలను తలదన్నే సినిమా ఇదే అని ఇప్పటికే తొడలు కొడుతున్నారు. ఈ సారి మా సత్తా చూపిస్తాం అంటున్నారు.

సినిమాలో వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా, సిద్ధార్థ్ ఆనంద్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజున చిరంజీవి సైరా కూడా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండంతో వార్ సినిమా వారికి తలపోటుగానే పరిణమించవచ్చని ట్రేడ్ విశ్లేషకుల భావన.