war between minister Vidadala Rajini MP Lavu Krishna Devarayaluవచ్చే ఎన్నికలలో వైసీపీ 175 స్థానాలను గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెపుతున్నారు. అయితే అందుకు పార్టీలో నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తూ నిత్యం ప్రజల మద్యనే ఉండాలని సిఎం జగన్ సూచిస్తున్నారు. కానీ చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో కూర్చొని టిడిపి, జనసేనలను వాటి అధినేతలను విమర్శిస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు తప్ప గడప గడపకి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు.

మరికొంతమంది నేతలు వారిలో వారు కుమ్ములాడుకొంటూ వచ్చే ఎన్నికలలో తమ సీట్లు తమకే దక్కేలా రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా వైసీపీలో రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనికి, వైసీపీ నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మద్య గల విబేధాలు మరోసారి బయటపడ్డాయి.

బుదవారం నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోగల లింగంగుంట్లలో 200 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి విడదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరూ హాజరయ్యారు. కానీ సమావేశంలో ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదు. మంత్రి తన ప్రసంగం ముగియగానే ఎంపీని పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వైసీపీ కార్యకర్తలు షాక్ అయ్యారు. ఈ లెక్కన తాము ఇద్దరిలో ఎవరి నాయకత్వంలో పనిచేయాలని వారికి సందేహం కలిగితే ఆశ్చర్యం లేదు.

నిజానికి వారిరువురి మద్య చాలా కాలంగానే విభేధాలున్నాయి. తన లోక్‌సభ నియోజకవర్గంలో ఆమె పెత్తనం చలాయిస్తుండటం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నచ్చడం లేదు. అధికారిక కార్యక్రమాలలో తన పట్ల ఈవిదంగానే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మంత్రిగా ఉన్న తాను గుంటూరు జిల్లాతో సహా రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుందని, దానికి కూడా ఎవరో బాధపడతానంటే తానేమీ చేయలేనని మంత్రి విడదల రజని చెపుతున్నట్లు తెలుస్తోంది.

వీరివురి మద్య విబేధాల గురించి సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళగా ఆయన ఇద్దరినీ సున్నితంగా మందలించి కలిసి పనిచేసుకోవాలని హితవు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈరోజు కార్యక్రమంలో వారిరువురి మద్య దూరం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదని స్పష్టం అయ్యింది. వైసీపీ నేతలు ఈవిదంగా ఉంటే మరి వచ్చే ఎన్నికలలో175 స్థానాలు ఏవిదంగా గెలుచుకొంటారో చూసి తీరాల్సిందే.