ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్నేహం గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే… స్నేహం ఎప్పుడూ హర్షించదగిందే గానీ కేసీఆర్ అనే వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండవల్లి జగన్ ను హెచ్చరించారు.
“కేసీఆర్ అనే వాడు మంచి వక్త. ఎన్నికలు రాగానే ఆంధ్ర – తెలంగాణ సెంటిమెంట్ అంటూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఇదిగో నేను ఇది ఆంధ్ర నుండి తెలంగాణకు తెచ్చాను అని చెప్పుకుంటాడు. సెంటర్ లో మోడీ ఎలాగైతే ముస్లిం సెంటిమెంట్… పాకిస్తాన్ సెంటిమెంట్ వాడతాడో ఇక్కడ కేసీఆర్ కూడా అంతే,” అంటూ చెప్పుకొచ్చారు ఉండవల్లి.
“స్వాతంత్రం వచ్చిన తరువాత జవహర్ లాల్ నెహ్రు తరువాత మన ప్రధానమంత్రులలో అంతటి వ్యక్త మోడీ మాత్రమే. కాకపోతే నెహ్రూ క్లాస్, మోడీ మాస్. ఆయనతో నాకు ఎటువంటి విబేధాలు లేవు. మంచి కమిట్ మెంట్ ఉన్న నాయకుడు. కానీ ఆయన సిద్ధాంతంతోనే నేను ఏకీభవించను,” అని మోడీ గురించి చెప్పుకొచ్చారు ఆయన.
“దేశంలో హిందుత్వ వాదం పేరుతో మొత్తాన్ని జయించే ప్లాన్ లో మోడీ, అమిత్ షా. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ అవసరం ఎప్పటికంటే ఎక్కువగా ఉంది. అయితే రాజకీయాలు అనేది ఒక సర్కిల్ లాంటిది. కాంగ్రెస్ పని అయిపోతుందని అనుకోవడం లేదు. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది,” అంటూ జోస్యం చెప్పారు ఆయన.