Vundavalli Aruna Kumarతాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదంటూనే తాను జగన్ మంచి కోరేవాడినని చెబుతూ ఉంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన పోలవరం నిర్వాసితులకు జగన్ ప్రభుత్వం న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.

అలాగే ఆంధ్ర, తెలంగాణల మధ్య ఉన్న నీటి తగాదాల మీద కూడా ఆయన స్పందించారు. ఇందులో భాగంగా అహంకారపూర్వకంగా మెలగడం తగదని ఉండవల్లి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కు హితవు పలికారు.

“రఘురామ కృష్ణంరాజు ఉదంతం ఉదాహరణ. అసలు రఘురామ కృష్ణంరాజు అనే వ్యక్తి గతంలో జగన్ కోసం సిబిఐ డైరెక్టర్ మీదనే యుద్దానికి వెళ్ళాడు. అయిదారు కోట్ల వ్యాపారం చేసుకునే వాడు సిబిఐ డైరెక్టర్ మీదకు వెళ్లడం అంటే మాటలా?,” అన్నారు.

“అటువంటి రఘురామ కృష్ణంరాజుతో మీకు వైరం ఏమిటి? మీరు టిక్కెట్ ఇస్తేనే కదా ఆయన ఎంపీ అయ్యింది. పార్లమెంటరీ కమిటిలో చోటు దక్కింది. ఆ తరువాత ఏం జరిగింది? రాజద్రోహం కేసు పెట్టించి కొట్టాల్సిన అవసరం ఏంటి?,” అని అడిగారు.

“రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఇది పెద్ద గొడవ అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల కంటే పెద్ద కేసు ఇది. అవసరమా ఇదంతా? చిన్న వాడికి పెద్ద వాడికి గొడవ జరిగినప్పుడు పెద్ద వాడు ఒక మెట్టు దిగితేనే ఆయన గొప్పతనం నిలబడుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అహంకారం అనేది చాలా ప్రమాదం అని తెలుసుకోవాలి,” అని వారించారు ఆయన.