Vundavalli Aruna Kumarరాజశేఖరరెడ్డి తనయుడు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి మీద నాకు ఎప్పుడూ అభిమానమే అని చెబుతూ ఉంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఉన్నఫళంగా ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి జగన్ పాలన పై పలువిమర్శలు చేశారు. కొన్ని విధానాలను తప్పు పట్టినా జగన్ ను డైరెక్టుగా విమర్శించడానికి మాత్రం ఉండవల్లి మొహమాటపడ్డారు.

రాజమండ్రి వద్ద పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఆవ భూములను ప్రభుత్వం సేకరించడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. అలాగే కొన్ని చోట్ల భూమికి ఉన్నదాని కంటే ఎక్కువ రేట్లకు కొనుగోలు చేశారని, ఇసుకలో అవినీతి జరుగుతుందని అయితే కొందరు అందులో జగన్ కు కూడా వాటా ఉందని అంటున్నారు.. కానీ నేను నమ్మను అని చెప్పుకొచ్చారు ఆయన.

నమ్మకపోవడానికి ఆయన చెప్పిన కారణం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. “గోదావరంతా ఇసుకే అయినా మనకే ఇబ్బంది అంటే ఏం జరుగుతుంది? పోనీ జగన్ దగ్గర నుండి అంతా ఒక్కటే… అంతా కలిపి వాటాదారులు అంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు. ఎందుకంటే… నిజంగా అదే అయితే జగన్ పదే పదే అవినీతిరహిత పాలన ఇస్తా అని చెప్పడు,” అని చెప్పుకొచ్చారు.

జగన్ కు వాటా వెళ్తుందా లేదా అనేది నిర్ణయించే స్థితిలో లేము గానీ… అవినీతి రహిత పాలన ఇస్తా అని అంటున్నాడు కాబట్టి అవినీతి చేస్తాడు అంటే నమ్మకపోవడమేంటి? ప్రపంచంలో ఎక్కడైనా అవినీతి చేసే వాడు అవినీతి పాలన అందిస్తా అని చెబుతాడా? లేక నేను అవినీతి చేశా అని ఒప్పుకుంటాడా? ఉండవల్లి ఏం మాట్లాడుతున్నారు?