Jagan Vundavalli aruna kumarఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కావడంతో పరోక్షంగా సహకరించిన ప్రముఖ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, మరోసారి జగన్ పై ఫైర్ అయ్యారు. అధికారం రాక ముందు వరకు జగన్ పాలనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరందరికి ప్రస్తుతం స్పష్టత వచ్చేసినట్లుగా కనపడుతోంది.

జగన్ మోహన్ రెడ్డి ఓ పెద్ద వ్యాపారవేత్త. అందులో ఎటువంటి సందేహం లేదు, వ్యాపారవేత్తలు సాధారణంగా వ్యాపారం మాత్రమే ఆలోచిస్తారు. ఈ రాష్ట్రం నడపడం అనే వ్యాపారం ఆయన ఆలోచన చేసి ఉంటారేమో తాను భావిస్తున్నట్లుగా ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో అమలవుతోన్న కరెంట్ కోతల గురించి స్పందించారు.

ప్రస్తుతం ఫిబ్రవరిలో ఇలా కరెంట్ కోతలు ఉంటే, ఏప్రిల్, మే నెలలు వచ్చేపాటికి పరిస్థితి ఏంటి? అంటూ చేతులెత్తేసారు ఉండవల్లి. దేశంలో బొగ్గు కొరత ఉందని పేపర్లో రాస్తున్నారు, మరి దానిని అధిగమించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా ప్లానింగ్ ఉందా? ఏం చేయబోతున్నారు? అంటూ ప్రశ్నించారు.

గత ప్రభుత్వం వలనే అంతా అయిపోయింది అంటే కుదరదు, అధికారం మార్పిడి అందుకే కదా, ఆయన అంతా ఇలా చేసేసారు, ఇక ఇప్పుడు నేనేం చేయలేను అంటే ఇంకా ఎన్నికలు ఎందుకు? అధికార మార్పిడి ఎందుకు? అంటూ జగన్ తీరుపై మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్ పై మొత్తం నాకు సీట్లు ఇస్తే తెప్పిస్తా అన్న మనిషి, వాళ్లకు పూర్తి మెజారిటీ ఉందని చేతులెత్తేయడం ఏమిటని ప్రశ్నించారు.

నిజంగా కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉండి ఇవ్వకూడదు అనుకుంటే, కేరళకు ఎప్పుడూ ఏం ఇవ్వకూడదు, బెంగాల్ కు ఇవ్వకూడదు, నవీన్ పట్నాయక్ కు ఇవ్వకూడదు, యూపీకి ఇవ్వకూడదు, ఇవన్నీ ఒకప్పుడు బీజేపీయేతర ప్రభుత్వాలు, వీటికేమి ఆగలేదే! ఒక్క ఏపీకి మాత్రం మన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం వస్తే ఇస్తారా? ఇది అసలు ఒక సమాధానమేనా?

పోలవరం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్న ప్రాజెక్ట్. ఆయన కుమారుడు వచ్చాడు కదా, పూర్తి చేస్తాడని అంతా భావించాం, ఏం చేసారు ఇప్పటివరకు? రాష్ట్రం పూర్తి చేస్తుందని చంద్రబాబు తీసుకుని తప్పుచేస్తే, మీరు పార్లమెంట్ లో చర్చ పెట్టి కేంద్రానికి అప్పచెప్పేయొచ్చు కదా, లేదా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావొచ్చు కదా, ఇంత మెజారిటీ ఉన్నపుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.

ఎందుకు ఇన్ని తప్పటడుగులు వేస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదంటూ ఉండవల్లి తన ఆశ్చర్యాన్ని ప్రకటించారు. తొలి రెండు సంవత్సరాలపై ఒక్క కామెంట్ కూడా చేయకుండా జగన్ పాలనను పరిశీలించిన ఉండవల్లి లాంటి ప్రముఖులు, గత మూడు, నాలుగు నెలలుగా తీవ్రస్థాయిలో జగన్ పాలనను తూర్పారపడుతున్నారు. ఇక అర్ధం కావాల్సింది ప్రజలకే అన్న రీతిలో ప్రసంగిస్తున్నారు.