Vundavalli-Arun-Kumar comments on Jagan Mohan Reddyనాకొక్క అవకాశం ఇచ్చి చూడండి… ఆంధ్రప్రదేశ్ ను ఎక్కడికో తీసుకెళ్తాను… అంటూ 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన ప్రచారానికి ఫలితంగా 151 సీట్లతో ముఖ్యమంత్రిగా అధికార పీఠం చేపట్టారు. మరి ప్రపంచ పటంలో ఏపీని ఎక్కడ నిలబెట్టారు? అంటే…

‘దౌర్భాగ్య’ స్థితిలోకి ఏపీని నెట్టివేశారు అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు. ఈ స్థితి నుండి ఏపీని ఎవరైనా రక్షించగలరా? జేపీ, రఘురామ, ఇంకా అభివృద్ధి చెందిన అమెరికా నుండి ఎవరినైనా తీసుకొచ్చి సీఎం చేసినా ఏపీని బయట పడేయగలరా?

ముఖ్యమంత్రిగా జగన్ పూర్తి స్థాయిలో విఫలమయ్యారన్న ఉండవల్లి, ఇప్పటికే 6 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇంకా అప్పులను పెంచుకుంటూ పోతూ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అంటూ జగన్ సర్కార్ తీరును ఎండకట్టారు.

తాను గత 40 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, ఏనాడూ ఎన్టీఆర్ కూతుళ్లపై ఇసుమంత గాసిప్ కూడా వినలేదని, అలాంటి వారిపై కామెంట్స్ చేయడం ఒక హేయమైన చర్యగా ఉండవల్లి అభివర్ణించారు. మానసికంగా సరిగా లేని వారే అలా అంటారని చెప్పిన ఉండవల్లి, టిడిపి నేత పట్టాభి విషయంలో సీఎం జగన్ తీరును తప్పుపట్టారు.

‘బిపి వచ్చి ఎవడో కొట్టాడు’ అని స్వయానా ఒక ముఖ్యమంత్రి అనొచ్చా? అంటే ఇంకా బాగా బిపి వస్తే చంపేయొచ్చా? ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది దేనికి? అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ పాలనను కీర్తించిన ఉండవల్లి, ఇన్నేళ్ల రాజకీయంలో ఇంత అధ్వానమైన పాలనను చూడలేదని అన్నారు.

అడిగిన వారికల్లా ‘ఒక్క ఛాన్స్’ ఇస్తే పరిస్థితి ఏమవుతుందోనని ఏపీ ప్రజలకు కూడా ప్రస్తుతం తెలిసి వస్తోంది. అర్హులను అందలం ఎక్కిస్తే పర్లేదు గానీ, అనర్హులను అధికారం అప్పచెప్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతుంటాయో అందరికీ అర్ధమయ్యే విధంగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన నిలిచిపోతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.