Vundavalli Aruna Kumar - YS Jaganన్యాయవ్యవస్థ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ‌స్థానాలు, జ‌డ్జిల‌పై సీఎం జ‌గ‌న్ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి రాసిన లేఖ జ‌నాల్లోకి వెళ్లాల‌నే ఉద్దేశంతోనే బ‌య‌ట‌కు వ‌దిలార‌న్నారు.

ఈ అంశంలో కేంద్రం చేసుకోవాలంటే చేసుకోవచ్చని ఆయన అన్నారు. “కోర్టులలో తీర్పులు మారిపోతాయంటే నేను నమ్మను. చిన్న చిన్న కేసులలో వాయిదాలు లాంటివి జరగొచ్చు. అంతే గానీ హైకోర్టు స్థాయిలో తీర్పులు మారిపోతాయంటే నేను నమ్మను. హైకోర్టులో ఏవైతే తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవి సుప్రీం కోర్టులో కూడా అలాగే వచ్చాయి.

ఒకటి రెండు కేసులు తప్ప మన తెలుగు జడ్జీల బెంచ్లకు వెళ్ళలేదు,” అని చెప్పారు. “దీనిబట్టి మనం ఏదో లైన్ తప్పి నిర్ణయాలు తీసుకుంటున్నాం అని తెలుసుకుంటే మంచిది. మాకు మెజారిటీ ఉంది మా ఇష్టం అంటే కుదరదు. మనం తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్దంగా ఉండాలి,” అని ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి జగన్ కు హితవు పలికారు.

ఉండవల్లి తనని తాను రాజశేఖర రెడ్డి మనిషిని అని, జగన్ శ్రేయోభిలాషిని బహిరంగంగానే చెప్పుకుంటారు. కాబట్టి ఈ విషయంలో ఉండవల్లి సూచనలను జగన్ కొంత సానుకూలంగా తీసుకుని ఎక్కడ తప్పు జరుగుతుందో ఆలోచించుకుంటే మంచిది. తెలుసుకుంటారా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.