Voters coming to their village to voteరెండు తెలుగు రాష్ట్రాల మరికొద్ది గంటలలో ఓట్ల పండుగ. తెలంగాణ శాసనసభ ఎన్నికల పూర్తి కావడంతో కాస్త హడావిడి తగ్గినా… ఆంధ్రప్రదేశ్ లో తారస్థాయిలో ఉంది. నువ్వా నేనా అంటూ జరిగే ఎన్నికలలో ఓట్లు వెయ్యడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే వారికి తగిన ఏర్పాట్లు చెయ్యడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఉన్న రైళ్ళు అన్నీ కిక్కిరిసిపోయాయి. స్పెషల్ బస్సు లు లేవు… ప్రైవేట్ బస్సు లు డబ్బులు దండుకుంటున్నాయి.

ఆంధ్ర వైపుగా వెళ్లే అన్ని బస్సుల రేట్లు 4-5 రెట్లు పెంచేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. విజయవాడకు వెళ్లే అన్ని రోడ్లన్నీ ట్రాఫిక్ జాములు అయిపోయాయి. పంతంగి టోల్ గేటు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల నుంచి వాహనాలు కదలడం లేదు. దీనితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. టోల్ లేకుండా వదిలిపెట్టాలంటూ వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. కావాలనే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సహకరించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

గతంలో సంక్రాంతి రద్దీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టోల్ రద్దు చేసింది. హైదరాబాద్ నుండి వచ్చే జనం ఎక్కువగా తెలుగుదేశం ఓటర్లు ఉంటారనే అనుమనంతో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరి ఓటర్లు అయినప్పటికీ ప్రయాణికులు ఇబ్బంది పడటం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని 175 ఎమ్మెల్యే స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతుంది. 3.5 కోట్ల ఓటర్లు తమను వచ్చే అయిదేళ్ళు పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కాకపోతే ఫలితాల కోసం మాత్రం మే 23 వరకు ఆగాల్సిందే. అంటే దాదాపుగా నెలన్నర పాటు వేచి చూడాలి.