TDP Wins All MLC Seatsప్రజాసామ్య రాజకీయాలలో పార్టీల మద్య అవగాహన, పొత్తు అనేవి భాగాలు. అ పొత్తులు సిద్దాంతపరంగా ఉన్న సామీప్యతల వల్ల కావచ్చు, లేకపోతే ఒకే రాజకీయ లక్ష్యం కోసం కావచ్చు, కొన్ని ప్రత్యేక కారణాలు వల్ల కావచ్చు, రాజకీయ అవసరాల వల్ల కూడా కావచ్చు. అవి సర్వసాధారణం, వాటిని తప్పు పట్టడానికి లేదు. ఇంక కొన్ని పార్టీలు తెర వెనుక పరస్పరం సహకరించుకుంటా తెర ముందు గాలిలో కత్తులు తిప్పుతూ, ఉత్తుత్తి పోరాటం చేస్తూ సింగిల్ హాండ్ సింగం కబుర్లూ చెప్పవచ్చు, అదోరకం రాజకీయం. మరి కొన్ని పార్టీలు పొత్తులో ఉండీ ఎవరి ప్రయెూజనాలు వాళ్లు వెతుక్కోవచ్చు, ఇది ఇంకో రకం. ఇక విషయానికి వస్తే గత కొంత కాలంగా ఆంధ్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య పొత్తులపై వాగ్బాణాలు జరుగుతున్నాయి . ఒకరు సింహం సింగిల్ గా వస్తుంది అంటుంటే, మరొకరు మీతో ఏ పార్టీ కలవాలన్నా మసైపోతామని భయపడి పోతున్నాయి అంటూ ఎదురుదాడి. పొత్తులు రాజకీయంలో భాగం అయినా చివరికి పార్టీల మద్య ఓటు బదిలీ జరుగకపోతే పొత్తు వల్ల ఉపయెూగం ఉండదు. రాజకీయాల్లో 1+1 ప్రతిసారీ 2 అవ్వాలని నియమం లేదు. మరోపక్క కొందరు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు పొత్తు లేకపోతే ఓట్లు చీలిపోయి అధికారపక్షం లాభపడుతుందని కనుక పొత్తులుండాలని, కొందరు అధికారపక్ష నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షాల పొత్తుల వల్ల ఓట్లు బదిలీ జరిగితే తమకు నష్టం కనుక దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చెయ్యాలని రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎంయల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలను చూస్తే ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీల మద్య ఎటువంటి పొత్తులు జరగలేదు, కానీ పట్టభద్రుల ఎన్నికలకు పొత్తు లేకున్నా పిడియఫ్, టిడిపి ఒక అవగాహనతో ఎన్నికలకు వెళ్ళాయి, దానిని అనుసరించి పట్టభద్రుల ఎన్నికలను విశ్లేషించి చూద్దాం.

ఈ యంయల్సీ ఎన్నికల్లో పార్టీల మద్య పొత్తులు లేకపోయినా ఎన్నికలకు రెండు రోజుల ముందు తెలుగుదేశం, పిడియఫ్ తమ రెండవ ప్రాధాన్య ఓటును బదిలీ చేసుకోవాలనే అవగాహనకు వచ్చాయి. ఫలితాలను చూస్తే మూడు స్ధానాలలో మెుత్తం 7,16,664 ఓట్లు పోలవగా, తెదేపా కు 2,89,630 ఓట్లు వచ్చాయి. ఇవి పోలైన ఓట్లలో 40.4% కాగా, వైకాపా కు 2,36,972 ఓట్లు వచ్చాయి. ఇవి 33.06% ఓట్లు. పిడియఫ్ 12.82% తో 91,912 ఓట్లు సాధించగా, భాజపా 3.43% తో 24,611 ఓట్లు సాధించింది. వీటి ఆధారంగా ఎటువంటి పొత్తులు లేకున్నా నేరుగా అభ్యర్థిని ఎన్నుకున్న మెుదటి ప్రాధాన్య ఓట్లలో తెదేపా తిరుగులేని విజయం సాధించింది, తన సమీప ప్రత్యర్థి వైకాపా కంటే 7% అధిక ఓట్లు సాధించింది. మరొక పార్టీ జనసేన పోటీచేయకున్నా గత మూడేళ్ళుగా దాని మిత్రపక్షంగా ఉన్న భాజపా పోటీ చేసి 3.4% ఓట్లు సాదించింది. గత ఎన్నికల్లో భాజపా సాధించిన 0.5% కంటే ఇవి దాదాపు 3% ఎక్కువ, కనుక గత ఎన్నికలో జనసేన సాదించిన 5.6% శాతంలో సగంపైన భాజపాకు దక్కాయని చెప్పుకోవచ్చు. మిగిలిన ఓట్లు తెదేపా, వైకాపా, పిడియఫ్ మద్య పంచుకుని ఉండవచ్చు. డైరెక్ట్ ఓటింగ్ అయిన మెుదటి ప్రాధాన్య ఓట్లను చూస్తే తెదేపా సమీప ప్రత్యర్థి కంటే 7% ముందున్నది. గత ఎన్నికల్లో సాధించిన 40% ఓట్లను మెరుగుపరచుకుంది. జనసేన 2024 లో ఒంటరిగా పోటీ చేసి తనకున్న 5.5% ఓట్లను మెరుగుపరచుకుని రెట్టింపు తెచ్చుకున్నా, అవి రెండు ప్రధాన పార్టీల ఓటర్ల నుంచి సమానంగా వచ్చాయనుకున్నా కూడా 12% ఓట్లతో జనసేన మూడొవ స్థానంలో ఉంటుంది, మెుదటి రెండు స్థానాలు తెదేపా 37%, వైకాపా 30% దక్కించుకుంటాయి. ఇక తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లే యధాతధంగా వచ్చినా 46% వచ్చే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇరు పార్టీలు చెరొక నాలుగు శాతం సాధించినా వీటి ఉమ్మడి ఓట్ల శాతం 55% వరకు వచ్చే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే పొత్తు ఉన్నా, లేకున్నా తెదేపా విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పొత్తు తెదేపాకు ఓట్లు, సీట్ల మెజారిటీ మెరుగుపడటానికి మాత్రం ఉపయెూగపడవచ్చు తప్ప దాని గెలుపుపై ప్రభావితం చూపకపోవచ్చు.

ఇక రెండొవ ప్రాధాన్య ఓటును విశ్లేషిస్తే, పిడియఫ్, టిడిపి చివరినిమషంలో తమ ద్వితీయ ప్రాధాన్య ఓటును పరస్పరం మార్చుకోవాలనే అవగాహనకు వచ్చాయి. మొత్తంగా ముడు చోట్ల కలిపి 33,237 ఓట్లు తెదేపా/వైకాపాలకు లభిస్తే, అందులో 24,886 ఓట్లు తెదేపా కి, 8,351 వైకాపాకు లభించాయి. అంటే పరస్పర అవగాహన ఉన్నా పిడియఫ్ ఓటర్లలో 64% ఓటర్లు తమ ఓటును బదిలీ చెయ్యలేదు. కేవలం 27% తెదేపాకు తమ ఓటును బదిలీ చేస్తే, తమతో పోటీ పడుతున్నా, పార్టీల మద్య అవగాహన లేకున్నా 8% పిడియఫ్ ఓటర్లు తమ ప్రత్యర్థి వైకాపాకు బదిలీ చేసారు. పోటీలో ఉన్న మరొక పార్టీ భాజపా ద్వితీయ ఓట్లను విశ్లేషిస్తే మరింత ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. యంయల్సీ ఎన్నికలలలో భాజపా ఒంటరిగా పోటీ చేసింది. ఇంకా అధికారికంగా మిత్రపక్షంగా ఉన్నందునా జనసేన శ్రేణులు కూడా భాజపాతో ఉన్నాయనుకోవచ్చు. భాజపా నుంచి మెత్తం 12,977 ఓట్లు తెదేపా/వైకాపాలకు లభిస్తే, అందులో 9,275 తెదేపాకు, 6,413 ఓట్లు వైకాపా కు లభించాయి. నిజానికి 2019 ఎన్నికల ముందు నుంచి తెదేపా, భాజపా మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత విభేదాలున్నాయి. ఇక ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు తెదేపా పేరు చెబితేనే ఒంటి కాలు మీద లేస్తారు. రాష్ట్ర శాఖను గుప్పెట్లో పెట్టుకున్న ఆ నలుగురుగా చెప్పే సోము, జివియల్, విష్ణువర్ధన్ రెడ్డి, డియెూధర్ తెదేపా తో పోత్తు ప్రసక్తే లేదని ఎవరూ అడగకున్నా నెలకొకసారి చెబుతారు. వీరు వైకాపా అనుకూల వర్గంగా పేరుంది. పార్టీ నాయకుల ఆలోచన తెదేపాకు వ్యతిరేకంగా, వైకాపాకు అనుకూలంగా ఉన్నా, ఆ పార్టీ ఓటర్లు 37% వరకు తెదేపాకే మద్దతు ఇచ్చారు, వైకాపాకు 26% మద్దతు ఇచ్చారు. జనసేన ప్రస్తుతానికి భాజపా మిత్రపక్షం కనుక ఈ ఓట్లలో వారి ఓట్లు ఉంటే ఆ పార్టీ అభిమానుల్లో మెజారిటీ తెదేపాకు వచ్చాయనుకోవాలి. మెుత్తంగా తెదేపాకు ఈ రెండు పార్టీల నుంచి 37,863 ఓట్లు మాత్రం బదిలీ అయ్యాయి. ఇవి తెదేపా సొంతంగా తెచ్చుకున్న మెుదటి ప్రాధాన్య ఓట్లలో కేవలం 13% మాత్రమే. ఇక వైకాపా కు 14,764 ఓట్లు బదిలీ అయ్యాయి, ఇది ఆ పార్టీ సొంతగా తెచ్చుకున్న మెుదటి ప్రాధాన్య ఓట్లలో కేవలం 6.2% మాత్రమే. వీటిని బట్టి పొత్తుల్లో తెదేపాకు పిడియఫ్ ఓట్లు పూర్తిగా బదిలీ జరగలేదు, విభేదాలున్నా భాజపా ఓట్లు గణనీయంగా బదిలీ అయ్యాయని. ఒకవేళ జనసేన పోటీ చేసివున్నా వీటిలో పెద్దగా మార్పేమీ ఉండేది కాదు.

క్లుప్తంగా చెప్పుకుంటే, మెుదటి ప్రాధాన్య ఓట్ల సరళిని బట్టి ప్రజల నాడి తెదేపా కు అనుకూలంగా ఉందని, అధికార వ్యతిరేక ఓటు చీలలేదని, ఒంటరిగా పోటీ చేసినా గెలుపుకు అత్యధిక అవకాశాలున్నాయని అర్ధం అవుతుంది. రెండొవ ప్రాధాన్య ఓట్ల సరళిని బట్టి పొత్తుల వల్ల పూర్తి ఓటింగ్ బదిలీ జరగలేదని, పొత్తులో ఉన్నా, లేకున్నా ఓటరు తమకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నుకున్నాడని తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే 2024 ఎన్నికలలో పొత్తులకు సంబంధం లేకుండా ఓటరు తనకు కావలసిన, మంచి చేస్తుందనుకున్న పార్టీని ఇప్పటికే ఎంచుకున్నాడని అర్దం అవుతుంది.

శ్రీకాంత్