vizianagaram Government Hospital Name Changedవైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “మేము ప్రజల కోసమే రాజకీయాలు చేస్తాము తప్ప రాజకీయాల కోసం రాజకీయాలు చేయము. మాకు రాజకీయ ఎత్తుగడలు అవసరమే లేదు ఎందుకంటే ప్రజలు వైసీపీని ఓన్ చేసుకొన్నారు కనుక,” అని చెప్పారు.

అయితే వైసీపీకి రాజకీయాలు తప్ప మరో ఆలోచన ఉందని నిరూపిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏకంగా కోర్టు భవనాలకే వైసీపీ రంగులు వేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఈ రంగుల పిచ్చి ముదిరిపోయి సచివాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయించినప్పుడు హైకోర్టు చివాట్లు పెట్టి ఆ రంగులన్నీ తొలగించమని ఆదేశించింది. వైసీపీ రంగులు వేయడానికి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసి, వాటిపై సాధారణ రంగులు వేయడానికి మళ్ళీ కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయవలసి వచ్చింది. హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా వైసీపీ ప్రభుత్వం తీరు మారలేదని మరోసారి నిరూపించింది.

భవనాలకు వైసీపీ రంగులు వేసినంత మాత్రన్న అవన్నీ వైసీపీ ప్రభుత్వం కట్టించిందని కాదు. వాటికి వైసీపీ రంగులున్నాయి కనుక ప్రజలు గుడ్డిగా ఎన్నికలలో వైసీపీకి ఓటేస్తారనుకోవడం వెర్రితనమే అవుతుంది. ఈ రంగుల రాజకీయాలే కాదు పేరు మార్పు రాజకీయాలు కూడా చేస్తూనే ఉంది.

ఇటీవల ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు విజయనగరంలో సుప్రసిద్ద మహరాజా హాస్పిటల్‌ (ఆంధ్రప్రదేశ్‌ వైద్య విదాన పరిషత్ మహారాజా జిల్లా ఆసుపత్రి) పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా రాత్రికి రాత్రే మార్చేసింది. విజయనగరంలో గజపతి రాజ కుటుంబం ఆసుపత్రులు, విద్యా సంస్థలకు, దేవాలయాలకు భారీగా విరాళాలు అందించి భవనాలు కూడా ఇచ్చింది. వారి కుటుంబానికి చెందిన వేల ఎకరాలలో రైతులు పంటలు సాగుచేసుకొంటున్నారు. కనుక ఆ రాజవంశానికి కృతజ్ఞతగా, వారిపై గౌరవంతో ఆసుపత్రికి వారి పేరు పెట్టబడింది. అనేక దశాబ్ధాలుగా అదే పేరుతో కొనసాగుతోంది. కానీ ఆ రాజవంశానికి చెందిన ఆనంద గజపతి, బొబ్బిలి రాజులు టిడిపిలో ఉన్నారు కనుక వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రి పేరు మార్చేసినట్లు అర్దమవుతోంది. దీనిపై విజయనగరం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.