Vizianagaram-coronavirus- casesఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ కరోనా రహిత జిల్లాగా ఉన్న విజయనగరంలో ఒక కేసు నమోదయ్యిందని నిన్న మీడియా లో రాగా ప్రభుత్వం మాత్రం ఆ మేరకు మెడికల్ బులెటిన్ లో చూపించలేదు. అయితే ఈరోజు విడుదలైన మెడికల్ బులెటిన్ లో విజయనగరం జిల్లాలో ఏకంగా మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయని అధికారులు ధృవీకరించారు.

కరోనా రహిత జిల్లా కావడంతో జిల్లా సరిహద్దులు మూసేసి బయట వారిని లోపలకి రాకుండా చర్యలు చేపట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఇటీవలే కేంద్రం ప్రకటించిన కరోనా ప్రభావిత జిల్లాల లిస్టులో ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న ఒకే ఒక్క గ్రీన్ జోన్ జిల్లా విజయనగరం. ఇప్పుడు ఆ హోదా పోయింది.

ఇది ఇలా ఉండగా… గడిచిన 24 గంటల్లో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,833కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 78 మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 38కి చేరింది.

ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 1015 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కేసులు పెరగడంతో ఇది ఎటు దారి తీస్తుందో అని ఆందోళనలో అందరు ఉన్నారు. పైగా జోన్ల పేరిట చాలా చోట్ల మినహాయింపులు ఇవ్వడంతో ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందేమో అని అందరు అనుకుంటున్నారు.