vizag airport worker stabbed ys jaganతన పాదయాత్ర ముగించుకుని శుక్రవారం నాడు కోర్టుకు హాజరు కావాల్సిన దరిమిలా విశాఖపట్నం నుండి హైదరాబాద్ బయలుదేరిన వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. ఎయిర్ పోర్టులో ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ లో పనిచేస్తోన్న శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష అధినేత పైనే కత్తితో దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

‘సార్ 160 సీట్లు వస్తాయా’ అంటూ జగన్ ను పలకరించిన సదరు నిందితుడు, జగన్ తో సెల్ఫీలు కూడా దిగగా, అనంతరం దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది సదరు వ్యక్తి అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించగా, దీని వెనుక ఎవరున్నారో తమకు తెలియాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

పందెం కోళ్ళకు వినియోగించే కత్తి గనుక, అది విషపూరితం అయి ఉంటుందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే జగన్ ను ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయిస్తామని చెప్పగా, మరో వైపు హోంమంత్రి చినరాజప్ప స్పందిస్తూ… విచారణ జరుగుతోందని, మరికొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అధికార పక్షంపై దాడి చేసే పనిలో వైసీపీ వర్గాలు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.