Vivekam USA Premier show Talk2008లో ‘సౌర్యం’ సినిమా ద్వారా దర్శకుడిగా తెరంగ్రేటం చేసిన శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ చేసిన “వివేకం” సినిమా విడుదలైంది. భారీ మాస్ ఫాలోయింగ్ కలిగిన అజిత్ నటించిన ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంభినేషన్ లో వచ్చిన ‘వీరమ్, వేధాలం’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ కావడంతో, ఈ తమిళ ‘వివేగం’పై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? అంటే… యుఎస్ ప్రీమియర్ షో టాక్ ప్రకారం అయితే భిన్న స్పందనలను తెచ్చుకుంది.

క్లుప్తంగా కధ గురించి చెప్పాలంటే… హీరో అజిత్ కు అప్పగించిన ఓ మూడు టాస్క్ లను ఎలా పూర్తి చేసాడు అన్నదే కధ. అయితే ఈ కధను పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసాడు దర్శకుడు శివ. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఒకానొక సమయంలో ప్రేక్షకులకు ఊపిరి సలపనివ్వకుండా చేసారు. కేవలం ‘యాక్షన్ లవర్స్’ కోసమే అన్నట్లుగా తీర్చిదిద్దిన ఈ సినిమాలో మేకింగ్ వాల్యూస్, రీచ్ విజువల్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసారు. అయితే వీటితో వందకు వంద శాతం సంతృప్తి పడిన ప్రేక్షకులు, కొత్తదనం లేని కధను మలిచిన విధానంతో మాత్రం అసంతృప్తి చెందుతున్నారు.

అజిత్ ఇంట్రడక్షన్ షాట్ తో ప్రేక్షకుల చేత ‘వావ్’ అనిపించిన దర్శకుడు శివ, ఆ తర్వాత అదే రేంజ్ ను కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఫస్టాఫ్ అంతా కేవలం యాక్షన్ సన్నివేశాలతో నిండిపోగా, సెకండాఫ్ లో యాక్షన్ తో పాటు కాస్త హీరోయిన్ కాజల్ సెంటిమెంట్ సన్నివేశాలను జోడించారు. అయితే ఎక్కడా కూడా ప్రేక్షకులను ‘కంఫర్ట్’ జోన్ లో అయితే కూర్చోపెట్టలేకపోయింది. ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే… కధలోకి ప్రేక్షకుడ్ని తీసుకువెళ్ళాలి. కానీ ఈ సినిమాలో అదే మిస్ అయినట్లుగా కనపడుతోంది. సినిమా ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలు చొప్పించారు గానీ, అవి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడం మైనస్.

ఇక నటీనటుల అభినయం విషయానికి వస్తే… ఈ వయసులోనూ అజిత్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు చేయడం ప్రశంసించదగ్గ పరిణామం. అభిమానులకైతే ‘ఐ ఫీస్ట్’ అని చెప్పవచ్చు. అజిత్ తర్వాత సినిమాలో ప్రేక్షకులకు గుర్తుకువచ్చేది వివేక్ ఒబరాయ్ పాత్ర. ఓ పక్కన స్నేహితుడిగా, మరో పక్కన ప్రతినాయకుడిగా… తాను ఎలాంటి రోల్స్ అయినా చేయగలనని నిరూపించుకున్నారు. వీరిద్దరు మినహాయిస్తే… ఇక సినిమాలో నటన పరంగా చెప్పుకోవడానికి ఇతర నటులకు ఆస్కారం తక్కువే. ఫస్టాఫ్ లో చాలా తక్కువ రోల్ కలిగిన కాజల్, సెకండాఫ్ లో కాసింత ఎక్కువసేపు కనిపించి తన పరిధి వరకు ఓకే అనిపించుకుంది.

ఇక ఫస్టాఫ్ లో ఓ 15 నిముషాలు కనిపించిన అక్షర హాసన్ గురించి చెప్పుకోవడానికేం లేదు, ఈ పాత్ర ఆమె కెరీర్ కు కూడా ఉపయోగపడేది కాదు. సాంకేతిక విభాగానికి వస్తే… ఫోటోగ్రఫీ అదిరిపోగా, అనిరుధ్ పాటల గురించి ప్రేక్షకులు ఇప్పటికే తీర్పు ఇచ్చేయగా, యాక్షన్ మూవీ కావడంతో ‘అదుర్స్’ అనిపించే విధంగా బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఉండదు. ఓవరాల్ గా చెప్పాలంటే… ఈ సినిమాకు ‘అంత లేదు’ అన్న టాక్ అయితే యుఎస్ ప్రీమియర్ షోస్ నుండి వెలువడింది. మరికొద్ది గంటల్లో… మీ అభిమాన ‘మిర్చి9.కాం’లో పూర్తి సినీ విశ్లేషణ కోసం వేచిచూడండి..!