YS_Avinash_Reddy_CBIవివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేడు మరోసారి హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తాను పార్లమెంట్ సమావేశాలలో పాల్గొనవలసి ఉంది కనుక నేడు విచారణకు హాజరుకాలేనంటూ అవినాష్ రెడ్డి వ్రాసిన లేఖకు సీబీఐ స్పందించలేదు. ఈ విషయంలో హైకోర్టు కూడా కలుగజేసుకోలేనని చెప్పడంతో నేడు విచారణకు హాజరుకాక తప్పలేదు.

అయితే ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినందున సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు ఆయన భయపడవలసిన అవసరం లేదు. కానీ సీబీఐ విచారణలో ప్రతీసారి వివేకా హత్యకేసుకు సంబందించి కీలక వివరాలను అవినాష్ రెడ్డి నుంచి రాబడుతుంటుంది. కనుక ఆవిదంగా ఆయన ఈ కేసులో నుంచి బయటపడలేనంతగా ఇరుక్కుపోవచ్చు.

అవినాష్ రెడ్డి నేడు తన న్యాయవాదితో కలిసి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కానీ అవినాష్ రెడ్డి ఒక్కరినే లోనికి అనుమతించారు. ఈరోజు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ పూర్తయ్యేలోగా ఒకవేళ హైకోర్టు ఆయన అరెస్ట్ విషయమై తీర్పు చెప్పిన్నట్లయితే తదనుగుణంగా సీబీఐ చర్యలు చేపట్టవచ్చు.

వివేకానంద రెడ్డిని ఆస్తి కోసమే ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఈ హత్య చేయించారని హైకోర్టులో ఆయన న్యాయవాది వాదించడం, అవినాష్ రెడ్డి కూడా అదే ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. కనుక వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా హైకోర్టు అనుమతితో ఈ కేసులో ప్రవేశించక తప్పలేదు. సీబీఐ సమర్పించిన బలమైన సాక్ష్యాధారాలన్నీ అవినాష్ రెడ్డే ఈ హత్య చేయించారని స్పష్టం చేస్తుంటే, అవినాష్ రెడ్డి కాలయాపన చేస్తూ ఈ కేసులో నుంచి తప్పించుకొనేందుకు ఇటువంటి నిరర్ధకమైన వాజ్యాలు వేస్తున్నారని ఆమె తరపు న్యాయవాది వాదించారు.

సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు వెలువరించబోయే తీర్పు అవినాష్ రెడ్డిని న్యాయస్థానం దోషిగా భావిస్తోందా లేదా అనేది కూడా స్పష్టం కావచ్చు. ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్టు చేసుకోవచ్చని తీర్పు చెప్పిన్నట్లయితే ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందని హైకోర్టు కూడా నమ్ముతున్నట్లు భావించవచ్చు.