Vivek Agnihotri reveals male molestation in bollywoodబాలీవుడ్ లో స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ‘హేట్ స్టోరీ’ ఫేమ్, దర్శక నిర్మాత వివేక్‌ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌ లో పెనుకలకలం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల పర్వాన్ని బట్టబయలు చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో… తన బంధువుల అబ్బాయి ఇటీవల బాలీవుడ్ లో నటించేందుకు అమెరికా నుంచి వచ్చాడని తెలిపాడు.

దీంతో తాను అతనిని ఒక స్టార్ హీరో, దర్శకనిర్మాతకు పరిచయం చేశానని అన్నాడు. వారిద్దరూ అతనిని లైంగికంగా వేధించారని ట్వీట్ చేశాడు. దీనిపై మీడియా అతనిని సంప్రదించగా, బాలీవుడ్‌ లో హర్వే వెయిస్టీన్‌ లను వెలికి తీస్తే అగ్ర హీరోలు, దర్శకులు బయటపడతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాంటి వారి చేతుల్లోనే తన బంధువు నలిగిపోయాడని పేర్కొన్నాడు.

వారి గురించి బయటకు చెప్పి, పోరాడే ధైర్యం ఎవరికీ లేదని వివేక్ స్పష్టం చేశాడు. వారి గురించి బయట పెట్టాలంటే బోలెడంత మంది కగనా రనౌత్ లు ధైర్యంగా ముందుకు రావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. బాలీవుడ్ లో అడుగు పెట్టేవారిపై లైంగిక, ఆర్థిక, అధికారం అండతో వేధింపులకు దిగుతారని అన్నాడు.

ముందు పడక గదికి రమ్మంటారన్నాడు. దానికి వ్యతిరేకిస్తే డబ్బులడుగుతారని చెప్పాడు. దానికీ లొంగకపోతే అవకాశమిచ్చి ఊడిగం చేయించుకుంటారని వివేక్ అగ్నిహోత్రి ఆరోపించాడు. మీ టూ ఉద్యమం కేవలం స్త్రీలకే పరిమితం కాకూడదని, పురుషులు కూడా అందులో భాగస్వామలవ్వాలని వివేక్ పిలుపునిచ్చాడు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి.