JanaSena-Pawan-Kalyan-Vizagవిశాఖ బీచ్‌ రోడ్డు నిత్యం పర్యాటకులతో, యువతీయువకులతో కళకళలాడుతుంటుంది. కానీ మొన్న మధ్యాహ్నం నుంచి విశాఖ బీచ్‌ రోడ్డులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఉత్తరాంద్ర పర్యటన కాదు కదా… ఆయన బస చేసిన హోటల్‌లో గదిలో నుంచి కూడా బయటకు రానీయకుండా నిర్బందించారు. ఇక బీచ్‌ రోడ్డులో ఆయనకు మద్దతుగా జనసైనికులు రాకుండా అడ్డుకొనేందుకు రోడ్డు పొడవునా అడుగడుగునా పోలీసులను మోహరించారు. తనను హోటల్‌లో నుంచి బయటకి వెళ్ళనీయకుండా నిర్బందిస్తే హోటల్‌లో గదిలో నుంచే పార్టీ కార్యకర్తలను పలకరించాలా?అని పవన్‌ కళ్యాణ్‌ పోలీసు అధికారులను ప్రశ్నించారు. కానీ ఆయనకు ఆ అవకాశం కూడా లేకుండా బీచ్‌ రోడ్డులోకి జనసైనికులు రాకుండా వందలాది మంది పోలీసులు కాపలాకాస్తున్నారు. ఎవరైనా జనసైనికులని అనుమానం కలిగితే వెంటనే వారిని పట్టుకొని పోలీస్ వ్యాన్ ఎక్కించి స్టేషన్‌కి తరలిస్తున్నారు. బీచ్‌ రోడ్డు మొత్తం పోలీసుల అధీనంలో ఉంది.

పవన్‌ కళ్యాణ్‌ ఉత్తరాంద్రలో కాదు కదా విశాఖలో కూడా ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని, తక్షణం హైదరాబాద్‌ తిరిగివెళ్లిపోవాలని, లేకుంటే హోటల్‌ గదిలో నుంచి బయటకు పంపే ప్రసక్తే లేదని ఒత్తిడి చేస్తుండటంతో, పవన్‌ కళ్యాణ్‌ ఉత్తరాంద్ర పర్యటన విరమించుకొని హైదరాబాద్‌కు బదులు విజయవాడ బయలుదేరబోతున్నట్లు తాజా సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసేందుకు పవన్‌ కళ్యాణ్‌ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ హోటల్‌ నుంచి విమానాశ్రయానికి బయలుదేరితే దారిలో ఎక్కడ మళ్ళీ జనసైనికులు హడావుడి చేయకుండా ఉండేందుకు దారిపొడవునా కూడా వందలాదిమంది పోలీసులను మోహరిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఉత్తరాంద్ర జిల్లా పర్యటనకు వస్తే శాంతిభద్రతలపేరుతో ఆయనని హోటల్‌లో గదిలో నిర్బంధించి వెనక్కు తిప్పి పంపుతుండటంపై జనసేన కార్యకర్తలతో పాటు టిడిపి, బిజెపిలు కూడా తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశపాలన సాగిస్తున్నారని టిడిపి, బిజెపిలు విమర్శిస్తున్నాయి.

అయితే పవన్‌ కళ్యాణ్‌ని, జనసేన కార్యకర్తలను ఈవిదంగా అడ్డుకోవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం, పోలీసులే ఆయనకు, జనసేన పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉచిత ప్రచారం కల్పిస్తున్నామనే సంగతి మరిచినట్లున్నారు. తెలంగాణలో ప్రజలు కూడా విశాఖలో జరుగుతున్న ఈ హడావుడిని ఆసక్తిగా టీవీలలో గమనిస్తున్నారు.