Vissakhapatnam-Polamamba-shops-demolishedఅభివృద్ధి అంటే కొత్తవి నిర్మించడమా లేక ఉన్నవి కూల్చేసుకోవడమా?అనే సందేహం కలుగుతుంది ఏపీలో కూల్చివేతల జోరు చూస్తుంటే! ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం అంటే అభివృద్ధి కోసం అనేకమంది ఇళ్ళు కూల్చివేసింది వైసీపీ ప్రభుత్వం. అందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మూల్యం చెల్లిస్తుండటం విశేషం!

ఇప్పటం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున విరాళం అందజేస్తున్నారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. కానీ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ అర్జెంటుగా విశాఖలో బాధితులను ఆదుకోవడానికి బయలుదేరాల్సి ఉంటుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఈనెల 12వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ విశాఖలో పర్యటిస్తున్నారు. ఆరోజున ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో బహిరంగసభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. కనుక యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో బహిరంగసభ కోసం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజుగారు తలుచుకొంటే దెబ్బలకు కరువా?అన్నట్లు బహిరంగసభకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. చాలా సంతోషం. అయితే సమీపంలో పోలమాంబ ఆలయం వద్ద చిన్న చిన్న దుకాణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పాన్ షాపులు, టిఫిన్ సెంటర్లు, టీస్టాల్స్, కూరగాయల దుకాణాలు వగైరా ఉన్నాయి. వాటన్నిటినీ సోమవారం అర్దరాత్రి చెప్పపెట్టకుండా మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో కూల్చివేశారు! ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే కదా?

అనేక ఏళ్లుగా అవే జీవనాధారంగా జీవిస్తున్న వ్యాపారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పది రోజుల క్రితం అధికారులు వచ్చి ప్రధాని మోడీ పర్యటన ఉంది కనుక భద్రతా కారణాలతో దుకాణాలన్నీ తాళాలు వేసి మూసేయాలని ఆదేశించారని అందుకు తామందరం అంగీకరించామని బాధితులు చెప్పారు. ఒకవేళ దుకాణాలు కూల్చేయాలని నిర్ణయించుకొంటే ముందే చెప్పి ఉంటే వాటిలో ఉన్న తమ సామాగ్రి అంతా తీసుకుపోయేవాళ్ళమని, కానీ చెప్పాపెట్టకుండా కూల్చివేయడంతో దుకాణాలలో ఉన్న సామాగ్రి అంతా ధ్వంసం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక దుకాణ యజమాని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “రెండు నెలల క్రితమే నేను రూ.2.5 లక్షలు అప్పు చేసి రేకులు కొని షెడ్ వేసుకొని దానిలో వ్యాపారం చేసుకొంటున్నాను. కానీ అధికారులు చెప్పాపెట్టకుండా దుకాణాన్ని కూల్చివేయడంతో తీవ్రంగా నష్టపోయాను. మేమందరం గత 20-25 ఏళ్ళుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకొంటూ బ్రతుకుతున్నాము. మేమేమీ ఉగ్రవాదులం కాదు కదా?ప్రభుత్వం మా మీద అణుబాంబు వేసినట్లు జేసీబీలు పెట్టి మా దుకాణాలను కూల్చివేయాల్సిన అవసరం ఏముంది? దుకాణాలు ఖాళీ చేసి పొమ్మంటే మా సామాను తీసుకొని పోయేవాళ్లం కదా? కానీ చెప్పాపెట్టకుండా దుకాణాలు కూల్చివేసి ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసింది. ఇప్పుడు మేమందరం ఎలా బ్రతకాలి?మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి?చేసిన అప్పులు, వాటికి వడ్డీలు ఎలాతీర్చాలి?దుకాణాలు కూలగొట్టినందుకు మేము చాలా బాధపడుతున్నాము. నిజమే! ప్రభుత్వం మా పరిస్థితిని అర్దం చేసుకొని మాకు ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అంటూ కన్నీటితో వేడుకొన్నారు.

అయితే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంలో క్షణం తీరిక లేకుండా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి బహుశః వారి గోడు వినిపించకపోవచ్చు. కనుక మళ్ళీ పవన్‌ కళ్యాణే వచ్చి వారిని ఆదుకోవాలేమో?ఈ లెక్కన రాష్ట్రంలో జోరుగా కూల్చివేతలు జరుగుతుంటే వారందరినీ ఆదుకోవాలంటే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు మానేసి పూర్తిగాసినిమాలకు అంకితమైతే తప్ప సరిపోదేమో?