Das Ka Dhamkiటాలీవుడ్ లో ఇప్పటిదాకా డబుల్ ఫోటో సినిమాలు ఎన్ని వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జనరేషన్ నాని దాకా అందరూ ద్విపాత్రాభినయాలు చేసినవాళ్ళే. కొందరు ట్రిపుల్ రోల్స్ కూడా చేశారు. వీటికి వచ్చిన చిక్కు ఒకటే. కవలలుగా చూపించినా చూపించకపోయినా స్టోరీ లైన్స్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. పెద్దగా క్రియేటివిటీ చూపించడానికి ఉండదు. అందుకే ఇలాంటివి మన హీరోలు రెగ్యులర్ గా ట్రై చేయరు. అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టరు. విశ్వక్ సేన్ తానూ ఈ లీగ్ లో చేరాలని దాస్ కి ధమ్కీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కోటీశ్వరుడైన ఒక కుర్ర డాక్టర్ సంజయ్(విశ్వక్ సేన్) యాక్సిడెంట్ లో చనిపోతాడు. అతను చక్కబెట్టాల్సిన పనులు కొన్ని ఉండటంతో చిన్నాన్న (రావు రమేష్) అచ్చం వాడిలాగే ఉండే స్టార్ హోటల్ సర్వర్ కృష్ణదాస్(విశ్వక్ సేన్)ని రంగంలోకి దించుతాడు. ఇంటద్దె సరిగా కట్టలేని స్థితిలో ఉన్న దాస్ వెంటనే ఒప్పేసుకుని సంజయ్ వేషం వేసుకుంటాడు. ఇదంతా రొటీన్ లైనే. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఇక్కడి నుంచి ట్విస్టులు పేర్చుకుంటూ పోయాడు. ప్రతి పది నిమిషాలకో మలుపు ఉండేలా చూసుకున్నాడు. విశ్వక్ ని స్వయంగా డైరెక్ట్ చేయడానికి ప్రేరేపించినది ఇవే.

ఒక ప్రాధమిక సూత్రం ఇద్దరూ మర్చిపోయారు. కేవలం వరసబెట్టి వచ్చే ట్విస్టులతో ఆడియన్స్ ని థ్రిల్ చేయలేం. వాటికి ముందు వెనుకా క్రియేటివ్ గా అనిపించే బలమైన స్క్రీన్ ప్లే పడాలి. అరె భలే షాక్ ఇచ్చాడే అనుకోవాలి. అంతే తప్ప ఊహించని పాత్రకు నెగటివ్ షేడ్స్ పెట్టడం వల్ల ఇది జరగదు. విశ్వక్ లో మంచి డైరెక్టర్ ఉన్నాడు. అందులో డౌట్ లేదు. కానీ అతని లోపలే ఉన్న రైటర్ దర్శకుడిని పక్కకు తోసేసి ఆధిపత్యం చూపించాలనుకోవడమే అసలు సమస్య. క్రైమ్ థ్రిల్లర్ ని కమర్షియల్ బిల్ లో ఇరికించాలని చూస్తే ఫలితం దక్కదు. ఎటుకాకుండా పోయే ప్రమాదం ఉంది. ధమ్కీ ఆ రిస్కుని ఫేస్ చేయాల్సి వచ్చింది ఇందుకే.

జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు విశ్వక్ సేన్ పూర్తిగా నటన వైపు ఫోకస్ పెట్టి యంగ్ టాలెంట్ చేతికి దర్శకత్వ బాధ్యతలు ఇస్తే గొప్ప ఫలితాలు అందుకోవచ్చు. ఒకప్పుడు దాసరి, భాగ్యరాజా లాంటి వాళ్ళు సులభంగా రెండు పడవల ప్రయాణం చేయగలిగారు కానీ ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తప్ప ఎక్కువ చేయలేని పరిస్థితి నెలకొన్నప్పుడు యూత్ స్టార్లు మైకు పట్టుకోకపోవడమే మంచిది. ఎంత అందగత్తె అయినా తల నుంచి కాళ్ళ దాకా ఒంటి నిండా నగలు అలంకరిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే టైపులో దాస్ కా ధమ్కీ బిర్యానీలో ముక్కల కన్నా మసాలానే ఎక్కువయ్యింది.